- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియల్ ఎస్టేట్ దందాపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఎన్నికల వేళ రాహుల్‌గాంధీ విద్యార్థులతో మాటముచ్చట పెట్టి ఉద్యోగాల పేరుతో మోసం చేసింది నిజం కాదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల వేళ రాహుల్‌గాంధీ విద్యార్థులతో మాటముచ్చట పెట్టి ఉద్యోగాల పేరుతో మోసం చేసింది నిజం కాదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో కేటీఆర్ శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. హైదరాబాద్‌కు తలమానికంగా దేశంలో ఉన్న ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. విశిష్టమైన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కాంగ్రెస్ వాడాలనుకుంటున్నదని తెలిపారు. 50 ఎకరాల యూనివర్సిటీ భూమిని అక్రమంగా తీసుకోవాలని చూస్తున్నదని.. రాష్ట్ర ప్రభుత్వం సీరియల్ కిల్లర్ల మాదిరి సీరియల్ ల్యాండ్ స్నాచర్‌గా మారిందని ఆరోపించారు. అన్ని యూనివర్సిటీ భూములను గుంజుకోవడం ఓ ప్రక్రియ పెట్టుకున్నదన్నారు. ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు పేరిట చెప్పి తీసుకున్నదని.. 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. విద్యార్థుల ఆందోళన.. ప్రజల వ్యతిరేకత.. సుప్రీంకోర్టు జోక్యంతో తాత్కాలికంగా ఆగిందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వ్యవహారంలో పదివేల కోట్ల భూమి కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టు చెప్పినా ఇప్పటిదాకా కేంద్రం ఎలాంటి విచారణ చేపట్టలేదని పేర్కొన్నారు.
ఎందుకు స్పందించడం లేదు?
ఈ ప్రభుత్వం విద్యాసంస్థల భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వంలో యూనివర్సిటీ విస్తరణ కోసం అవసరమైన నిధులను అందిస్తామని చెప్పారు. ఈ అంశాన్ని అవసరమైతే రాజ్యసభలో తమ పార్టీ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తుతారని తెలిపారు. మైనార్టీల సంరక్షకుడిని అని చెప్పుకునే రాహుల్ గాంధీ.. ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ మొహబ్బత్‌కి దుకాణం అని చెప్తున్నది ఇదేనా? అని నిలదీశారు. యూనివర్సిటీలో భూములు ఖాళీ ఉన్నవి కావని.. భవిష్యత్తు విస్తరణ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమం వల్లనే హైదరాబాదులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పడిందన్నారు. త్యాగాల ఆధారంగా ఏర్పడిన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ కోసం వాడడం దారుణమన్నారు. నోటిఫికేషన్లు ఏవి అని నిలదీసినందుకు వారిని దారుణంగా తిడుతూ లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ ఎందుకు ఫోజులు కొట్టారని నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా పోలీసులతో దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో బట్టల దుకాణం, సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి రేవంత్‌రెడ్డి వెళ్తున్నారని విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు తిప్పారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.






