జీహెచ్ఎంసీ విభజనను వ్యతిరేకిస్తున్నాం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Muthe.Rajitha |

ప్రజాభిప్రాయం సేకరించకుండానే మజ్లిస్ పార్టీ ఒత్తిడి, కాంగ్రెస్​రాజకీయ ప్రయోజనాల కోసం విభజన జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

జీహెచ్ఎంసీ విభజనను వ్యతిరేకిస్తున్నాం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మజ్లిస్ పార్టీ ఒత్తిడి, కాంగ్రెస్​పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజేంద్రనగర్, మహేశ్వరం వంటి ప్రాంతాల్లోని మజ్లిస్ ఆధిపత్యం కలిగిన ప్రాంతాలను కోర్ జీహెచ్ఎంసీలో చేర్చారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్న పరిస్థితిలో ఇది మరింత భారమవుతుందన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ విభజనపై ఎటువంటి అభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. జనాభా లెక్కలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు, వార్డుల విభజన చేయకూడదని దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధంగా నోటిఫికేషన్ ఇచ్చారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గజ్వేల్, నల్లగొండ, హైదరాబాద్ కార్పొరేషన్లను విభజించింది. ఇది పూర్తిగా చట్టవ్యతిరేక నిర్ణయం.

జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్‌గిరి పేర్లతో కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 300 వార్డులు, 60 సర్కిళ్లతో నగర పాలన పునర్వ్యవస్థీకరణ చేశారు. 31 డిసెంబర్​ 2025 తర్వాత ఎలాంటి మార్పులు చేయరాదని, అవసరమైతే మే 2027 వరకు వేచి చూడాలని సెన్సస్ డైరెక్టరేట్ స్పష్టంగా పేర్కొనట్లు తెలిపారు. అయిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఓఆర్ఆర్‌ను సరిహద్దుగా తీసుకుంటామని చెప్పినా, కొన్ని ప్రాంతాలు ఓఆర్ఆర్ బయట, మరికొన్ని లోపల ఉంచడం జరిగింది. ఎయిర్‌పోర్టు, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ వంటి కీలక ప్రాంతాలను జీహెచ్ఎంసీ పరిధి నుంచి మినహాయించింది. రాష్ట్రానికి జీహెచ్ఎంసీ పరిధి నుంచే సుమారు 70 శాతం ఆదాయం వస్తోంది. వాటర్ వర్క్స్ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్-ఆర్ ట్యాక్స్ పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతోందని విమర్శించారు.

ఎన్‌వోసీలు, ల్యాండ్ పర్మిషన్లు, భూముల రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ డాక్యుమెంటేషన్ వంటి మార్పుల కోసం కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు ఆర్-ఆర్ ట్యాక్స్ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరులో ఆర్-ఆర్ ట్యాక్స్ 12 శాతం వసూలు చేస్తే, తెలంగాణలో 30 శాతం వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని తాము కూడా మూసీ శుద్ధి కోరుకుంటున్నామన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో సరైన వసతులే లేవు, 50 శాతం సిబ్బంది కొరత ఉంది, సానిటేషన్ తూతూమంత్రంగా జరుగుతోంది. ఆదాయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ఆర్-ఆర్ ట్యాక్స్ వసూళ్లు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. మున్సిపల్​ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని ఇది మక్తల్‌కే పరిమితం కాలేదు.

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఇదే విధానాన్ని అనుసరించిందన్నారు. బహిరంగంగా, పోలీసుల సమక్షంలోనే, పోలింగ్ బూత్‌ల లోపల బయటా విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేసింది. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నదా అనే అనుమానం కలుగుతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ డబ్బు రాజకీయాలనే నమ్ముకుని ఎన్నికల్లో పాల్గొన్నాయి. ప్రజల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత, బీఆర్ఎస్‌పై ఆదరణ లేకపోవడం స్పష్టంగా కనిపించడంతో, చివరికి డబ్బు, దౌర్జన్యాల ఆధారంగా ఎన్నికలను ప్రభావితం చేయాలని ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి మంచి ఫలితాలను సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

ఓటమి భయంతో కాంగ్రెస్​బెదిరింపు రాజకీయాలు : బీజేపీ చీఫ్​రాంచందర్​రావు

మున్సిపల్​ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ పట్టును కోల్పోతామనే భయంతోనే ఈ అరాచకాలకు పాల్పడింది. పోలింగ్ రోజున కూడా అనేక కేంద్రాల్లో బిజెపి కార్యకర్తలపై దాడులు చేసి, పోలింగ్ సెంటర్ల వద్ద నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ మా కార్యకర్తలు వెనుకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడ్డారు. డబ్బు, అధికారబలం, అధికార మదంతో గెలవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పాఠం చెప్పక తప్పదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక స్థానాల్లో ఓటమి తప్పదని, బీఆర్ఎస్ పార్టీ కూడా అరకొర తప్పితే గెలిచేదేమీ లేదు. కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి ఒకే మాట చెబుతున్నామని ఇది ప్రజాస్వామ్య పోరాటం.

ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోమని మాకార్యకర్తలు ప్రతిఘటించి, ఎదురుతిరిగితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపులకు భయపడి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది. తమ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కార్పొరేషన్‌ను దారుస్సలాం కేంద్రంగా ఉన్న మజ్లిస్ పార్టీకి కట్టబట్టే ప్రయత్నం చేసింది. కోర్ హైదరాబాద్‌ను మజ్లిస్‌కు తాకట్టుపెట్టే విధంగా జీహెచ్ఎంసీని విభజించి, జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజించిందన్నారు.

Next Story