ఊపందుకోని ఖరీఫ్ సాగు

by Jakkula.Mamatha |

వానాకాలం మొదలై నలబై రోజులు దాటింది. ఇప్పటికీ భారీ వర్షాలు లేవు. వాగులు, చెరువుల్లో నీళ్లు లేవు.

ఊపందుకోని ఖరీఫ్ సాగు
X

దిశ, వరంగల్ బ్యూరో: వానాకాలం మొదలై నలబై రోజులు దాటింది. ఇప్పటికీ భారీ వర్షాలు లేవు. వాగులు, చెరువుల్లో నీళ్లు లేవు. భూగర్భ జలాల పెరుగుదల లేదు. లోటు వర్షపాతం తో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో రైతులు నిర్ణయించిన లక్ష్యంలో 32 శాతమే సాగు చేశారు. ఆరుతడి పంటలు వేసిన రైతులు భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేక, భూగర్భ జలాలు లేక రైతులు వరి సాగుకు జంకుతున్నారు. ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, దేవాదుల ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదల లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం ఆరంభమై 40 రోజులు దాటింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు భారీ వర్షాలు పడలేదు. ములుగు జిల్లాలో ఓ మోస్తారు వర్షం పడిన మిగతా ఐదు జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 79 మండలాలు ఉండగా 52 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ దఫా అతి తక్కువగా వర్షం పడింది. ఉమ్మడి జిల్లా పరిధిలో సాగు ఊపందుకోలేదు. నిర్ణయించిన లక్ష్యంలో 32 శాతం కూడా పూర్తి కాలేదు. అనుకున్న లక్ష్యానికి పంటల సాగు కాలేదు.

మొదలు పెట్టని వరి సాగు..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ దఫా 15.93 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ శాఖ ఖరీఫ్ ప్రణాళికలో వెల్లడించారు. హన్మకొండ జిల్లాలో 2 లక్షల 38 వేల 964 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 2లక్షల 81 వేల 943 ఎకరాలు, జనగామ జిల్లాలో 3 లక్షల 59 వేల 981 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 3లక్షల 71వేల 318 ఎకరాలు, ములుగు జిల్లాలో 1లక్ష 29వేల 824 ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 2లక్షల 11వేల 670 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేశారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 5లక్షల 10వేల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు అయ్యాయి. నిర్ణయించిన లక్ష్యంలో 32 శాతం లోపే పంటలను సాగు చేశారు.ఈ పంటల్లో అత్యధికంగా పత్తి పంటనే రైతులు వేశారు.

ఉమ్మడి జిల్లా పరిధిలో 5 లక్షల 95 వేల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా ఈ 40 రోజుల్లో 4 లక్షల 25 వేల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పత్తితో పాటు మొక్కజొన్న, పసుపు, ఇతర పంటలను వేశారు. వరి సాగు ఇంకా మొదలు పెట్టలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో 9 లక్షల 25 వేల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 45 వేల ఎకరాల్లో మాత్రమే వరి పంటను సాగు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం వరిసాగు ఇప్పటి వరకు 5 శాతానికి మించి కాలేదు. ఉమ్మడి జిల్లాలో ఏ మండలం పరిధిలో చూసిన లోటు వర్షపాతమే నమోదైంది.సాధారణ సగటు వర్షపాతం నమోదు కాలేదు.

భారీ వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేకపోవడం, చెరువులు నిండకపోవడం వల్ల రైతులు ఎక్కువగా పంటల సాగు చేయడం లేదు.వర్షాకాలం మొదలైన ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం ఇప్పటికీ అన్ని మండలాల పరిధిలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల రైతులు పంటలు వేసేందుకు జంకుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎస్సారెస్పీ, దేవాదుల ద్వారానే 7లక్షల ఎకరాలకు పైగానే పంటలు సాగు అవుతాయి. ఎస్సారెస్పీ కాకతీయ కాలువ స్టేజ్-1, స్టేజ్-2 పరిధిలో 5 లక్షల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఎస్సారెస్పీతో పాటు మిడ్ మానేరులో నీటి మట్టాలు గరిష్టంగా ఉన్నప్పుడు రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నారు. ఎస్సారెస్పీలో నీళ్లు తక్కువగా ఉన్నా భారీ వర్షాలు పడి చెరువులు, కుంటలు నిండి వాగులు పొంగిన వరి సాగు ఎక్కువగా చేస్తున్నారు.

భారీ వర్షాలు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు సాగు ఊపందుకోలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో భారీగా పెరగలేదు. వేసిన పంటలు కాపాడుకునేందుకు వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పత్తి వేసిన రైతులు ఒకటికి రెండు సార్లు నీళ్లు అందిస్తే తప్ప బతకలేని పరిస్థితి ఉంది. భారీ వర్షాలు పడితే తప్ప వరి సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ దఫా ఎక్కువ మంది రైతులు సన్నాలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. వరి నారుమళ్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడంతో ఎక్కువ మంది రైతులు సన్న రకాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడితే తప్ప వరిసాగు చేసేందుకు జంకుతున్నారు.

వ్యవసాయ అధికారులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రకటనలు చేస్తున్నా రైతులు మాత్రం భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పంట రుణాల పంపిణీ కూడా జోరందుకోలేదు. ఈ ఖరీఫ్ లో 14 వేల కోట్ల పంట రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆయా జిల్లాలకు లక్ష్యాలను కేటాయించారు.లీడ్ బ్యాంకు సమావేశాల్లో జిల్లాల వారి లక్ష్యాలను నిర్ణయించారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 500 కోట్ల లోపే రుణాలను పంపిణీ చేశారు. బ్యాంకులు రైతులు వేసిన పంటల ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కూడా విడుదల చేయగా గ్రామాల్లో మాత్రం పంట రుణాలు ఎక్కువగా ఇవ్వడం లేదు. పాత రుణాలను పూర్తిస్థాయిలో చెల్లించిన వారికే కొత్త రుణాలను ఇస్తున్నారు. కొంత మందికి రుణాలను రెన్యువల్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పంటల సాగు విస్తీర్ణం పెరిగితే తప్ప పంట రుణాలు లక్ష్యాలకు అనుగుణంగా ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

వర్షాలు లేక పంట వేయలేదు: ఎనకమూరి భిక్షపతి(రైతు, చింతలపల్లి)

నాకు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.ఇప్పటివరకు రెండు ఎకరాల పత్తి వేసాను. మిగతా భూమి వరి సాగు కోసం సిద్ధం చేశాను.వర్షాలు లేక వరి సాగు మొదలు పెట్టలేదు.పత్తి వేసిన సక్రమంగా మొలవలేదు. గత సంవత్సరం ఈ సమయంలో పే వరి నాట్లు వేషం. ఈ సంవత్సరం సాగు చెయ్యడం రైతుకు కష్టంగానే ఉంది.

వరి నారు ముదిరిపోతుంది: ఎండీ మదర్(రైతు చింతలపల్లి)

నాకు 5 ఎకరాల పొలం ఉంది. ఎప్పటిలాగా కాలమవుతుందని నమ్మి రోహిణి కార్తిలో (మే నెలలో,) బి పీటీ సన్నరకపు వరి నారు పోసాను. రెండు నెలలు దగ్గరకు వస్తుంది. వర్షాలు లేవు. బావుల్లో నీళ్ళు లేవు. ఉన్న నీళ్లతో కొంత నాట్లు వేశాను. వర్షాలు పడితేనే మిగతా పొలం వేస్తాను.

Next Story