ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. సిట్ విచారణకు కేసీఆర్ అంగీకారం..!

by Malleboina Mahesh |   (  Updated:2026-01-31 10:03:37  IST  )

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. సిట్ విచారణకు కేసీఆర్ అంగీకారం..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case)లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR)కు సిట్ (SIT) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తొలుత విచారణ వేదికపై భిన్న వాదనలు వినిపించినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో రేపు సిట్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ అంగీకరించారు. అధికారుల నోటీసులపై ఆయన తన పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించి, చట్టపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అంతకు ముందు తనను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో విచారించాలని సిట్‌కు లేఖ రాయగా.. అధికారులు రిజెక్ట్ చేశారు. కేసీఆర్ వయస్సు, భద్రతా కారణాలను పరిగణనలోకి తీసుకుని, హైదరాబాద్‌ నందినగర్‌లోని ఆయన నివాసంలోనే విచారణ చేపట్టేందుకు సిట్ అధికారులు (SIT officials) మొగ్గు చూపారు. దీనిపై బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు, న్యాయ నిపుణులతో సూదీర్ఘంగా చర్చించారు. అనంతరం సిట్ విచారణకు కేసీఆర్ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీంతో రేపు మధ్యాహ్నం అధికారులు ఆయన ఇంటికి చేరుకుని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. ఈ విచారణ ప్రక్రియ అంతా వీడియో గ్రాఫీ ద్వారా చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నోటీసులు రావడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని నేతలు విమర్శిస్తుండగా, కేసీఆర్ మాత్రం విచారణకు సహకరించడం ద్వారా అసలు నిజాలను బయటపెట్టవచ్చనే యోచనలో ఉన్నారు. రేపటి విచారణలో కేసీఆర్ ఇచ్చే సమాచారం ఈ కేసు తదుపరి గమనాన్ని నిర్దేశించనుంది.

Next Story