- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం.. రూ.262 కోట్ల చారిత్రాత్మక పరిహారం
అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మరణానికి పరిహారంగా రూ.262 కోట్లు ఇవ్వాలని స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవి కందుల కేసు (Jahnavi Kandula case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మరణానికి పరిహారంగా రూ.262 కోట్లు ఇవ్వాలని స్థానిక ప్రభుత్వం (Local Govt) ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల (23), ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి సియాటెల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ (Northeastern University)లో మాస్టర్స్ చదువుతోంది. 2023 జనవరి 23న రాత్రి వేళ ఆమె రోడ్డు దాటుతుండగా, కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ కారు గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత, మరో పోలీస్ అధికారి డేనియల్ అడరర్ (Police Officer Daniel Aderer) తన బాడీ కెమెరా ఆన్‌లో ఉండగానే అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. జాహ్నవి మరణం గురించి మాట్లాడుతూ.. "ఆమె చనిపోయింది, ఆమె జీవితానికి పెద్దగా విలువ లేదు. కేవలం 11 వేల డాలర్లు (సుమారు రూ. 9 లక్షలు) ఇస్తే సరిపోతుంది" అంటూ నవ్వుతూ వెటకారం చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అనంతరం జాహ్నవి కుటుంబం అమెరికా కోర్టులో సియాటెల్ నగర యంత్రాంగం (Seattle city government)పై దావా వేసింది.
సుదీర్ఘ విచారణ అనంతరం, సియాటెల్ సిటీ కౌన్సిల్ (Seattle City Council), బాధితురాలి కుటుంబం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం జాహ్నవి కుటుంబానికి 31.1 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 262 కోట్లు) భారీ పరిహారంగా చెల్లించాలని నగర యంత్రాంగం నిర్ణయించింది. ఈ పరిహారంలో సియాటెల్ నగరం నేరుగా 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అందజేస్తారు. దీంతో పాటు, విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, అమానవీయ వ్యాఖ్యలు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతోందని కోర్టు స్పష్టం చేసింది.






