కీలక పరిణామం: లోక్‌సభ స్పీకర్‌పై నేడు అవిశ్వాస తీర్మానంపై చర్చ

by Malleboina Mahesh |

నేడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ. అమిత్ షా సమాధానం. 293 మంది సభ్యుల బలంతో తీర్మానాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధమైన ఎన్డీయే.

కీలక పరిణామం: లోక్‌సభ స్పీకర్‌పై నేడు అవిశ్వాస తీర్మానంపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత పార్లమెంట్ లో సోమావారం నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు (Second phase of budget sessions) ప్రారంభం అయ్యాయి. మొదటి విడత చివర్లో లోక్‌సభ స్పీకర్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా లక్ష్యంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు పార్లమెంట్‌లో కీలక చర్చ జరగనుంది. సభా నిర్వహణలో స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర సభ్యుల గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 118 మంది ఎంపీలు ఈ తీర్మానాన్ని నోటీసుగా ఇచ్చారు. స్పీకర్ పదవికి సంబంధించి ఇటువంటి రాజ్యాంగబద్ధమైన తీర్మానం రావడం భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక అరుదైన, కీలక పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ చర్చను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించనుండగా, చర్చ ముగింపులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రభుత్వం తరపున గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో స్పీకర్ ఓం బిర్లా తన హోదాలో సభను నిర్వహించలేరు. ఆయన స్థానంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల కమిటీలోని సీనియర్ సభ్యులు సభను నడిపిస్తారు. అయితే, స్పీకర్ సభలో ఉండి తనపై వచ్చిన ఆరోపణలను స్వయంగా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది. చర్చ అనంతరం ఓటింగ్ జరిగితే, స్పీకర్ కూడా ఒక సాధారణ సభ్యుడిలా ఓటు వేయాల్సి ఉంటుంది.

ప్రస్తుత సంఖ్యా బలాన్ని పరిశీలిస్తే, అధికార ఎన్డీయే కూటమికి 293 మంది సభ్యుల మద్దతు ఉండటంతో ఈ తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు, విపక్షాల బలం 238 వద్ద ఉండగా, తీర్మానం నెగ్గాలంటే 272 మంది సభ్యుల ఓట్లు అవసరం. సంఖ్యలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, సభలో తమ వాదనను బలంగా వినిపించడం ద్వారా ప్రజల్లోకి ఒక సందేశాన్ని పంపాలని విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాలు తమ ఎంపీలందరికీ విధిగా హాజరు కావాలని త్రీ-లైన్ విప్ జారీ చేయడంతో నేడు లోక్‌సభలో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.

Next Story