నంచర్ల ప్రజల కీలక నిర్ణయం.. వరి కొయ్యలను తగులబెడితే భారీ జరిమానా

by Jakkula.Mamatha |

మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో సర్పంచ్ ఎస్.గాయత్రీదేవి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు.

నంచర్ల ప్రజల కీలక నిర్ణయం.. వరి కొయ్యలను తగులబెడితే భారీ జరిమానా
X

దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో సర్పంచ్ ఎస్.గాయత్రీదేవి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సంక్షేమం తదితర అంశాలపై గ్రామసభలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ అధికారి(ఏవో) నరేందర్ హాజరై పలు అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో నరేందర్ మాట్లాడుతూ.. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు దొడ్డు రకం వరి కంటే సన్న రకం వరి సాగు చేస్తే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. పంట కోత అనంతరం వరి కొయ్యలను పొలాల్లో తగులబెట్టరాదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

రైతులు పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆయన పేర్కొన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా నిర్వహించాలని సూచించారు. వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, లేకపోతే డెంగీ, మలేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో చదువుకున్న యువత, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నందున గ్రంథాలయం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. దీనిపై స్పందించిన అధికారులు గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

అలాగే గ్రామం పెద్దదిగా ఉన్నందున ప్రభుత్వ వైద్యుడిని నియమించాలని గ్రామస్తులు కోరగా, ప్రస్తుతం ఏఎన్ఎం కొండమ్మ, ఆశా కార్యకర్తలు ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఆర్డీఎస్ సంస్థ తరఫున మహమ్మదాబాద్, గండీడ్ మండలాల ఎంఎస్‌డబ్ల్యూ అధికారి శ్రీను మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు స్వచ్ఛంద సంస్థ ద్వారా నెలకు రూ.4,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన పిల్లల వివరాలను అంగన్‌వాడీ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనపై కూడా గ్రామస్తులకు అవగాహన కల్పించి, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

గ్రామంలోని పోతురాజు చెరువు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా తక్కువ ఎత్తులో ఉన్నాయని వార్డు సభ్యుడు మైసయ్య గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. గ్రామ సర్పంచ్ ఎస్.గాయత్రీదేవి మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ నిధులు, అభివృద్ధి పథకాల సహకారంతో గ్రామంలో అవసరమైన మౌలిక వసతులను కల్పించి, రానున్న ఐదేళ్లలో నంచర్లను అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వి. శ్యామ్, వార్డు సభ్యులు చిన్నారెడ్డి సుజాత, స్వాతి, జ్యోతి, భానుప్రియ, టి. మంగమ్మ, మాధవులు, జోగు శీను, మైసయ్య, గ్రామ పెద్దలు, మాజీ బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బిక్షపతి, మాజీ వార్డ్ మెంబర్ జే. వీరాజీ, వెంకటేష్, జి.బాలవర్ధన్ రెడ్డి, జే.అంజి, కాంగ్రెస్ నాయకులు బి.బాల్ రెడ్డి, ఈ. భాస్కర్ రెడ్డి, బ్యాగరి సత్యయ్య, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మహిళలు, యువకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story