పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే స్వచ్ఛ పాఠశాల.. స్వచ్ఛ భారత్ లక్ష్యం

by Batti.Sumithra |

పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి తెలిపారు.

పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే స్వచ్ఛ పాఠశాల.. స్వచ్ఛ భారత్ లక్ష్యం
X

దిశ, జడ్చర్ల: పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జడ్చర్ల పట్టణంలో ‘స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ జడ్చర్ల పట్టణ అధ్యక్షుడు అమర్‌నాథ్ ఆధ్వర్యంలో జడ్చర్లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బాయ్స్ గవర్నమెంట్ కాలేజీ ఎదురుగా ఉన్న పాతబజార్ ప్రభుత్వ పాఠశాలలో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను శుభ్రపరిచారు. చెత్తను తొలగించి, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. అలాగే విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ దేశవ్యాప్తంగా ఒక సామాజిక ఉద్యమంగా మారిందన్నారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరిశుభ్రతను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుంటే సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, సామాజిక సంక్షేమ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాఠశాలలు, స్వచ్ఛమైన గ్రామాలు, స్వచ్ఛమైన పట్టణాల నిర్మాణం ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, పట్టణ నాయకులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలు, పార్టీ అభిమానులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story