తిరిగి పుంజుకొనేలా దీవించు: కేసీఆర్

by Gantepaka Srikanth |

మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తిరిగి పుంజుకొనేలా దీవించు: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర(Sammakka Saralamma Jathara) ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ అన్నారు. కొంగు బంగారమై, కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు, కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమై కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సమాజాల సబ్బండ కులాల సంస్కృతి, సంప్రదాయాలకు పదేండ్ల బీఆర్ఎస్ పాలన పెద్దపీట వేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరి లోయ పరీవాహక ప్రగతితో సమాంతరంగా సాగిన ఆధ్యాత్మిక అభివృద్ధిని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో ప్రగతి తిరిగి పుంజుకొని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క సారలమ్మ దేవతలను కేసీఆర్ ప్రార్థించారు.

రేపటినుంచే జాతర ప్రారంభం :

మరోవైపు మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది. ప్రారంభం(బుధవారం) నుంచి నాలుగు రోజుల పాటు సాగే మహా ఘట్టాన్ని సమర్థంగా.. భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సన్నద్ధమయ్యాయి. ఈసారి సౌకర్యాల కల్పనతోపాటు నిర్మాణ పనులనూ ఏకకాలం చేపట్టారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవైపు వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులు సాగుతున్న సమయంలోనే లక్షలాది మంది ముందస్తుగా అమ్మలను దర్శించుకున్నారు.

Next Story