- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
తాము అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పాలి, తాను చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తాము అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పాలి, తాను చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కార్పొరేషన్ పేరుతో అప్పు చేసి కాళేశ్వరం కట్టామని చెబుతున్నారని, ఆ అప్పులను రైతుల నుంచి వసూలు చేస్తారా? ఒక్కో రైతు నుంచి రూ.20 లక్షలు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. అప్పులపై చర్చకు సిద్దమని, తాను తెలంగాణ భవన్ ని కూడా వస్తానని మంత్రి జూపల్లి చేసిన సవాల్ నేపధ్యంలో గురువారం జూపల్లి ఏం చేస్తారన్న ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన గాంధీభవన్ లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని అనంతరం గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చారు. ఈ సందర్ఘంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ అప్పులపై చర్చకు సిద్ధం అని, సవాల్ కు కట్టుబడి గన్ పార్క్ దగ్గరకు వచ్చానని, బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఎవరూ రాలేదని మంత్రి జూపల్లి విమర్శించారు.
గాంధీభవన్ కు వెళుతున్న సమయంలో గన్ పార్క్ దగ్గరకు మాజీ మంత్రి హరీశ్ రావు వస్తున్నట్లు సమాచారం ఉండటంతో నేరుగా గన్ పార్క్ దగ్గరకే వచ్చానని, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా అప్పులపై ఇక్కడే చర్చించుకుందాం అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. బావ, బామ్మర్ది ఇద్దరూ కలిసి రండి అని మంత్రి జూపల్లి తెలిపారు. బావ ఒకచోట, బామ్మర్ది మరోచోట మాట్లాడటం ఎందుకు? మీ ఇద్దరికీ ఒకేసారి ఇక్కడే సమాధానం ఇస్తానని ఆయన సవాల్ విసిరారు. తాము చేసిన ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? తన వద్ద ఉన్న రికార్డులు, కాగితాలు ఇస్తా, చర్చకు రావాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6వేల కోట్ల వడ్డీ కడుతున్నామని మంత్రి జూపల్లి చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.8.21 లక్షల కోట్ల ఆర్థిక భారం : మంత్రి జూపల్లి
బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలన ముగిసే నాటికి తెలంగాణ రాష్ట్రంపై అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం రూ.8,21,651 కోట్ల ఆర్థిక భారం మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాము చేస్తున్న వ్యాఖ్యలు నిరాధారమని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా గన్ పార్కు అమరవీరుల స్థూపం సాక్షిగా ఆయన ఈ లెక్కలను మీడియా ముందు ఉంచుతున్నట్లుగా ఆయన తెలిపారు. 2014 జూన్ 2న రాష్ట్ర ఏర్పాటు సమయంలో మొత్తం బకాయిలు రూ.90,161 కోట్లు మాత్రమే ఉండగా, 2023 డిసెంబర్ 1 నాటికి అవి భారీగా పెరిగాయని వివరించారు. మొత్తంగా అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి రాష్ట్రంపై రూ.8,21,651 కోట్ల ఆర్థిక భారం మిగిలిందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రతిపక్ష నేతలు వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన సవాల్ విసిరారు. తాను మాటకు కట్టుబడి ఉన్నానని, కేటీఆర్, తన లెక్కలు తప్పని కేసీఆర్ తో చెప్పించాలని, 2.06.2014 నాటికి ఉన్న అప్పులు మొత్తం రూ. 90,161 కోట్లు, 1.12.2023 నాటికి ఉన్న అప్పుల మొత్తం రూ. 8,21,651 కోట్లు అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.






