ఎడ్యుకేషన్ హబ్‌గా కేబీ కాంప్లెక్స్

by Batti.Sumithra |

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమురం భీం (కేబీ) కాంప్లెక్స్ పలు ప్రభుత్వ విద్యాసంస్థలకు నిలయంగా మారి ఎడ్యుకేషన్ హబ్‌గా గుర్తింపు పొందింది.

ఎడ్యుకేషన్ హబ్‌గా కేబీ కాంప్లెక్స్
X

దిశ, ఉట్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని కొమురం భీం (కేబీ) కాంప్లెక్స్ పలు ప్రభుత్వ విద్యాసంస్థలకు నిలయంగా మారి ఎడ్యుకేషన్ హబ్‌గా గుర్తింపు పొందింది. ఒకే ప్రాంగణంలో గిరిజన ఐటీఐ కళాశాల, ఏటీసీ సెంటర్, గిరిజన గురుకుల జూనియర్ కళాశాల, గిరిజన గురుకుల డిగ్రీ బాలికల కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గిరిజన బీఈడ్ కళాశాల, గిరిజన ఆశ్రమ బాలుర క్రీడా పాఠశాల, వికాసం బాలబడి, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, గిరిజన యూత్ ట్రైనింగ్ సెంటర్, ఎస్‌బీఐ ఆర్‌సెటీ, హైమన్ స్టడీ సర్కిల్ వంటి విద్యా, శిక్షణా సంస్థలు ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతం యూనివర్సిటీ క్యాంపస్‌ను తలపిస్తోంది.

గిరిజన ఐటీఐ కళాశాల..

కేబీ కాంప్లెక్స్‌లో గిరిజన ఐటీఐ కళాశాలను 1984లో ఏర్పాటు చేశారు. ఇందులో ఎలక్ట్రిషియన్, డ్రాఫ్ట్‌స్మన్ (సివిల్), ఫిట్టర్, మెకానిక్, మోటార్ మెకానిక్, స్టెనోగ్రఫీ, కోపా (COPA) తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గిరిజన విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య అందించేందుకు గత ఏడాది నుంచి ఏటీసీ సెంటర్ కూడా ప్రారంభించి కొత్త కోర్సులను అందిస్తున్నారు.

గిరిజన ఆశ్రమ బాలుర క్రీడా పాఠశాల..

కేబీ కాంప్లెక్స్ ప్రవేశద్వారం సమీపంలో గిరిజన ఆశ్రమ బాలుర క్రీడా పాఠశాలను 1980కు ముందే ఏర్పాటు చేశారు. ఇందులో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధనతో పాటు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా ప్రతిరోజూ క్రీడా మైదానంలో శిక్షణ ఇస్తున్నారు.

గిరిజన గురుకుల డిగ్రీ బాలికల కళాశాల..

గిరిజన బాలికలకు ఉన్నత విద్య అందించేందుకు 2017లో గిరిజన గురుకుల డిగ్రీ బాలికల కళాశాలను ప్రారంభించారు. ఇందులో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన బోధనతో పాటు వసతి, ఎన్‌సీసీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

గిరిజన గురుకుల జూనియర్ కళాశాల..

2009లో కేబీ కాంప్లెక్స్‌లో గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇందులో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థినులకు హాస్టల్ వసతి, నాణ్యమైన బోధనతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల..

ఉట్నూర్ విద్యార్థులు డిగ్రీ చదివేందుకు గతంలో 70 కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం 2008లో ఉట్నూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసింది. ఈ కళాశాలలో బీఏ, బీఎస్సీ (బీజెడ్‌సీ, ఎంపీసీ), బీకాం, బీబీఏ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే కాకతీయ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీ, పీజీ డిస్టెన్స్ విద్యకు కూడా అవకాశం ఉంది. దోస్త్ ద్వారా విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్లు ఏర్పాటు చేసి భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

గిరిజన బీఈడ్ కళాశాల..

గిరిజన యువతకు ఉపాధ్యాయ విద్య అందించేందుకు 2008లో ఉట్నూర్‌లోని లాల్‌టెకిడిలో గిరిజన బీఈడ్ కళాశాలను ఏర్పాటు చేశారు. అక్కడ సరైన వసతి లేకపోవడంతో అనంతరం కేబీ కాంప్లెక్స్‌లో నూతన భవనాలు, హాస్టళ్లు, అధ్యాపకుల నివాస గృహాలు నిర్మించి తరగతులను ఇక్కడికి మార్చారు. డిగ్రీ పూర్తిచేసిన గిరిజన విద్యార్థులు ఇందులో ప్రవేశానికి అర్హులు. బీఈడ్ ప్రవేశ పరీక్ష లేకుండానే డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఐటీడీఏ అధికారులు ప్రవేశాలు కల్పిస్తున్నారు.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్..

గిరిజన విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019–20 విద్యాసంవత్సరంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్య అందిస్తున్నారు. విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, క్రీడా శిక్షణతో పాటు ఇతర సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వికాసం బాలబడి..

ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులకు విద్య అందించేందుకు 2016లో వికాసం బాలబడిని నిర్మించారు. అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.వి. కర్ణన్ ప్రత్యేక చొరవతో అన్ని సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మాత్రమే విద్య అందిస్తున్నారు.

స్వయం ఉపాధికి శిక్షణ కేంద్రాలు..

నిరుద్యోగ యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేబీ కాంప్లెక్స్‌లో 2015లో గిరిజన యూత్ ట్రైనింగ్ సెంటర్, 2008లో ఎస్‌బీఐ ఆర్‌సెటీ ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో శిక్షణతో పాటు వ్యాపార నైపుణ్యాలపై కూడా శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. శిక్షణ పొందే వారికి వసతి, భోజనం తదితర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు.

హైమన్ స్టడీ సర్కిల్..

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువత కోసం 2015లో హైమన్ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రంథాలయం అందుబాటులో ఉంటుంది. ఉద్యోగ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, అధ్యయన సామగ్రి ఇక్కడ లభ్యమవుతుంది.

యూనివర్సిటీని తలపిస్తున్న కేబీ కాంప్లెక్స్..

ఒకే ప్రాంగణంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా కేంద్రాలు, గ్రంథాలయం, స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు, క్రీడా మైదానాలు ఉండటంతో కొమురం భీం కాంప్లెక్స్ ప్రస్తుతం నిజమైన ఎడ్యుకేషన్ హబ్‌గా నిలిచింది. ఉదయం, సాయంత్రం విద్యార్థులు, క్రీడాకారులతో ఈ ప్రాంగణం సందడిగా మారుతూ యూనివర్సిటీ క్యాంపస్‌ను తలపిస్తోంది.

Next Story