- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లెలగూడ డివిజన్‌లో పడకేసిన పారిశుద్ధ్యం
జిల్లెలగూడ డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాడితప్పిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, మీర్‌పేట్ : జిల్లెలగూడ డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా గాడితప్పిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని మీర్‌పేట్, జిల్లెలగూడ, ప్రశాంతిహిల్స్ డివిజన్లలో ప్రధాన రహదారుల వెంట ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లెలగూడ స్వాగత్ హోటల్ నుంచి రాఘవేంద్ర నగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన చెత్త కుప్పలతో పాటు తొలగించిన చెట్ల కొమ్మలు సైతం రోజుల తరబడి అలాగే ఉండిపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే అంబేద్కర్ విగ్రహం నుంచి గాయత్రి నగర్ వెళ్లే ప్రధాన రహదారి వెంట కూడా చెత్త పేరుకుపోయినప్పటికీ అధికారులు వాటిని తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు రోడ్లపై పేరుకుపోయిన చెత్త నుంచి దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల బెడద అధికమవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్..
బడంగ్‌పేట్ సర్కిల్ అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






