ఆర్టీవో అధికారుల వేధింపులు ఆపాలి.. కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

by Kodari Anjali |

కాంక్రీట్ మిల్లర్ల విషయంలో రవాణా శాఖ (ఆర్టీవో) అధికారుల తీరుపై కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి. గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీవో అధికారుల వేధింపులు ఆపాలి.. కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
X

దిశ, ఖైరతాబాద్: కాంక్రీట్ మిల్లర్ల విషయంలో రవాణా శాఖ (ఆర్టీవో) అధికారుల తీరుపై కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి. గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా ఆర్టీవో సమస్యల నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని వారు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ను కలిసేందుకు నాయకులు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం వద్దే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. మొబైల్ స్క్వాడ్ల పేరుతో కాంక్రీట్ మిల్లర్లపై అక్రమంగా కేసులు రాయడం సరికాదన్నారు. పొట్టకూటి కోసం లేబర్‌గా జీవనం సాగిస్తున్న భవన నిర్మాణ కార్మికులను చలానాల పేరుతో వేధించడం దారుణమన్నారు. కాంక్రీట్ మిల్లర్లు కేవలం నిర్మాణ సామాగ్రి అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా అధికారులు జరిమానాలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్...

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కాంక్రీట్ మిక్సర్లకు మినాయింపు ఉన్నప్పటికీ, గత దశాబ్దాలుగా వస్తున్న ఈ మినాయింపులను పక్కనబెట్టి అధికారులు కేసుల పేరుతో బెదిరింపులకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో కమిషనర్ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, నేటికీ సంవత్సరం గడించిన అది కార్యరూపం దాల్చలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారుల వేధింపులు ఇలాగే కొనసాగితే వారం రోజుల తర్వాత రోడ్లపైనే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, కార్మికులకు రక్షణ కల్పించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ భరత్ కుమార్, రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి, ఈ. తిరుపతయ్య, బాలస్వామి, శాంతయ్య, రాములు, శ్రీరాములు, వెంకటేష్, పరశురాం, శ్రీనివాసులు, నాయకులు ప్రవీణ్, విజయ్, అంజి, ఆనంద్, మన్యం గౌడ్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story