- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయం
కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు తగ్గకుండా అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

దిశ, వరంగల్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు తగ్గకుండా అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి , నాగరాజు , హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వెంకట్రామ్ రెడ్డి,అయూబ్,MLC శంకర్ నాయక్ తో కలిసి మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణ రాజకీయాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , నటుడు చిరంజీవి సినీ రంగంలో చేసిన సేవలను అభినందిస్తున్నామని, అయితే తెలంగాణ రాజకీయాల్లో జోక్యం అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, రాష్ట్రంలో ఆ పార్టీ రాజకీయ ప్రాధాన్యం కోల్పోయిందని, అంతర్గత విభేదాలు, ఆస్తి వివాదాల కారణంగానే ఆ పార్టీ నాయకత్వంలో చీలికలు వచ్చాయని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పలు ప్రశ్నలు సంధిస్తూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.23 వేల కోట్ల రుణమాఫీ, పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలు మోసమా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో తెలంగాణకు అవసరమైన నిధులు, బొగ్గు, నీటి వాటాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వం ఎంత మేరకు ప్రశ్నించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సద్విమర్శలు స్వాగతిస్తామని, అయితే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం తగదన్నారు. బీజేపీపై కూడా మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. గత 12 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం ఏమి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వంటగ్యాస్ ధరలు, నిరుద్యోగ సమస్యలపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి లేఖలు రాస్తున్న బీజేపీ నేతలు ముందుగా ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించాలని, ఇంధన ధరలు, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రధానిని ప్రశ్నించే అవకాశం కల్పించాలని సూచించారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన ఆయన, లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఇసుక విధానంపై వస్తున్న విమర్శలను ఖండించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇసుక విధానాన్ని తీసుకురాలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇసుక మాఫియా విస్తరించిందని, దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావుకు పూర్తి అవగాహన ఉందన్నారు. బీజేపీ నేతలు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని, వరంగల్ వేదికగా బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. గత 12 ఏళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధి, గత మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల ముందే చర్చిద్దామని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆయన పేర్కొన్నారు.






