- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ హస్తం పార్టీలో ‘ప్రోటోకాల్’ వార్: బహిరంగంగానే నేతల వాగ్వాదం!
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారుతున్నాయి.

దిశ, సికింద్రాబాద్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. పార్టీలోని కీలక నాయకుల మధ్య సమన్వయం లోపించడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇందిరమ్మ చీరల పంపిణీలో ప్రోటోకాల్ రచ్చ
ఇటీవల సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని మాణికేశ్వర్ నగర్‌లో మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రభుత్వ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం తారస్థాయికి చేరింది. గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, సికింద్రాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆదం సంతోష్ కుమార్ మధ్య జరిగిన ఈ వివాదం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
సమయం వర్సెస్ ప్రోటోకాల్: అసలేం జరిగింది?
స్థానికుల కథనం ప్రకారం.. చీరల పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత ఆదం సంతోష్ కుమార్ ముందుగానే చేరుకున్నారు. ముఖ్య అతిథి కోసం కొంత సమయం వేచి చూసిన ఆయన, ఆ తర్వాత మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. అయితే, కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికే మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తాను రాకముందే పంపిణీ కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని, ప్రోటోకాల్‌ను ఎలా విస్మరిస్తారని ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులపై, కాంగ్రెస్ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. దీనికి సమాధానంగా.. ఆమె రావడం ఆలస్యం కావడం వల్లే కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి వచ్చిందని ఆదం సంతోష్ కుమార్ పేర్కొన్నారు. అయితే, తనకు అధికారులు సూచించిన సమయానికే తాను వచ్చానని, ముఖ్య అతిథిగా వచ్చే తనను కాదని ముందే ఎలా మొదలుపెడతారని శ్రీలతా రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఇరు నేతల మధ్య మాట మాట పెరిగి, బహిరంగంగానే ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. చివరకు అక్కడున్న ఇతర నాయకులు, కార్యకర్తలు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఇద్దరు నేతలు కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేసినప్పటికీ, ఈ లోపలి అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది.
డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్‌పై పెరుగుతున్న ఆరోపణలు
సికింద్రాబాద్ కాంగ్రెస్‌లో ఇటువంటి గ్రూపు తగాదాలు పెరగడానికి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ దీపక్ జాన్ వైఫల్యమే కారణమనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపులు లేకుండా, అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి నడిపించాల్సిన బాధ్యత కలిగిన డీసీసీ ప్రెసిడెంట్‌కు స్థానిక నాయకులలో గానీ, కార్యకర్తలలో గానీ పట్టు లేదని విమర్శలు వస్తున్నాయి. ఆయనపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. గతంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా డీసీసీ ప్రెసిడెంట్ దీపక్ జాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. తనను స్టేజి పై నుంచి సనత్ నగర్ సనత్ నగర్ ఇన్చార్జి కోట నీలిమ దింపేసారంటూ ఒక మహిళ కార్యకర్త బహిరంగంగానే డీసీసీ ప్రెసిడెంట్‌ను అక్కడే నిలదీశారు. దీనివల్ల అక్కడ గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ ఘటన అప్పట్లోనే పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని, నాయకత్వ లోపాన్ని ఎత్తిచూపింది.
అధిష్ఠానం జోక్యం చేసుకుంటుందా?
నాయకత్వ పట్టు లేకపోవడం వల్లే సికింద్రాబాద్‌లో ఇలాంటి వరుస అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్న ఈ పరిస్థితులను చక్కదిద్దకపోతే, రాబోయే రోజుల్లో పార్టీ మరింత నష్టపోయే ప్రమాదం ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.






