తిమింగలాన్ని వదిలి చిన్న చేప కోసం బీఆర్ఎస్ ఆరాటం

by Gantepaka Srikanth |

మేఘా కృష్ణారెడ్డికి రూ.25 వేల కోట్ల నైనీ టెండర్ల కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నదని.. మేఘా అనే తిమింగలాన్ని రక్షించేందుకు బీఆర్ఎస్ చిన్న చేప చుట్టూ సింగరేణి టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

తిమింగలాన్ని వదిలి చిన్న చేప కోసం బీఆర్ఎస్ ఆరాటం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేఘా కృష్ణారెడ్డికి రూ.25 వేల కోట్ల నైనీ టెండర్ల కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నదని.. మేఘా అనే తిమింగలాన్ని రక్షించేందుకు బీఆర్ఎస్ చిన్న చేప చుట్టూ సింగరేణి టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్ట్‌ల విషయంలో సుజన్‌రెడ్డి చిన్న చేప అని.. పెద్ద కాంట్రాక్టర్‌ను కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. గుంటనక్క, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, కేటీఆర్ కలిసి చిన్న చేపను పెద్దగా చూపి పెద్ద చేపను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సుజన్‌రెడ్డి అనే వ్యక్తికి వచ్చింది కేవలం రూ.250 కోట్ల కాంట్రాక్ట్ మాత్రమేనని.. ఆయన సీఎం బావమరిది అని ఆయనను పెద్దగా చేసి చూపెట్టి.. రూ.25వేల కోట్ల కాంట్రాక్ట్ చేపట్టే మేఘా కృష్ణారెడ్డి గురించి మాట్లాడటం లేదని పేర్కొన్నారు. అసలు సుజన్‌రెడ్డికి కాంట్రాక్ట్‌లు ఇచ్చిందే గుంటనక్క అని.. అప్పుడు సీఎం బావమరిది అని వీళ్లకు తెలియదా? అని ప్రశ్నించారు. సైట్ విజట్ నిబంధన కారణంగా కొంతమందికి అవకాశాలు దెబ్బతింటాయని.. కానీ, గుంటనక్క సాయిల్ ఎక్స్‌వేషన్ పేరుతో మేఘా కృష్ణారెడ్డి సంస్థ అనుభవం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తద్వారా రూ. 25 వేల కోట్ల కాంట్రాక్ట్ ను పెద్ద చేపకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

గుంటనక్కను గుడ్డిగా ఫాలో అవుతున్న కేటీఆర్

కార్మికులకు కష్టం వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పట్టించుకోవటం లేదని కవిత ఆరోపించారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ తప్పులే చేయనట్లు మాట్లాడటం విచిత్రంగా ఉన్నదని తెలిపారు. గుంటనక్క ప్రెస్ మీట్‌ను గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్ గుంతలో పడ్డారని ఆరోపించారు. చానెల్‌లో కథనం తర్వాత ఆ కథనం బ్యాక్ గ్రౌండ్ అంటూ ఇంకొక పేపర్‌లో కథనం వచ్చిందని.. దాని ఆధారంగా భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టారని పేర్కొన్నారు. భట్టి ప్రెస్‌మీట్ పెట్టగానే గుంటనక్క కూడా ప్రెస్‌మీట్ పెట్టినట్లు ఎద్దేవా చేశారు. గుంటనక్క ప్రెస్‌మీట్‌ను గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారని ఆరోపించారు. రెండేళ్లుగా తాము కార్మికుల సమస్యలపై ఎన్నిసార్లు మాట్లాడినా భట్టి స్పందించలేదని.. కార్మికులకు వంద అన్యాయాలు జరిగినా బీఆర్ఎస్ మాట్లాడలేదని అన్నారు. కానీ.. ఒక తిమింగళం లాంటి కాంట్రాక్టర్‌కు అన్యాయం జరిగితే ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. 2015లోనే మనకు నైనీ ముందుగా అలాట్ అయ్యిందని.. 2021లో అదానీ 44 శాతం ఎక్సెస్‌గా టెండర్ వేస్తే ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వలేదని వెల్లడించారు. మధ్యలో సింగరేణి వేరే కంపెనీ వాళ్లకు మట్టి తీసే టెండర్ ఇచ్చిందని.. దానికి డీజిల్ ఖర్చులతో సహా ఇచ్చారని.. కానీ గుంటనక్క అబద్ధం చెప్పారని ఆరోపించారు. కేటీఆర్ ఏ విషయమైనా అధ్యయనం చేసి మాట్లాడుతారని అనుకునేదాన్నని.. కానీ, ఆయన మాట్లాడుతుంటే దారుణం అనిపించిందని ఎద్దేవా చేశారు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదని అన్నారని.. కానీ చాలా టెండర్లను 36,16,7,8 శాతం ఎక్సెస్‌కు ఇచ్చారని స్పష్టం చేశారు. హరీశ్‌రావు దళిత కమ్యూనిటీని అవమానపరిచేలా భట్టి విక్రమార్కకు లేఖ రాయను అంటున్నారని.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మాత్రమే లెటర్ రాస్తారంటా? అని పేర్కొన్నారు. సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని గుంటనక్క అంటున్నారని.. కానీ అసలు గుంటనక్క వాటాలు తేలకపోవటంతోనే అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పైగా 2014 నుంచి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారని.. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే విచారణ చేయమని అడుగుతున్నారని వెల్లడించారు. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్‌లో పడి అదేవిధంగా డిమాండ్ చేస్తున్నారని.. బీఆర్ఎస్‌లోనే ఉంటూ కేసీఆర్‌కి గుంటనక్క ద్రోహం చేస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణికి రూ.25 వేల కోట్ల అప్పు పెట్టారని.. కాంగ్రెస్ వచ్చాక అది రూ.50 వేల కోట్లు అయ్యిందని అన్నారు. దీంతో సింగరేణి సంస్థ జీతాల కోసం కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. నైనీ టెండర్లు రద్దు చేసినట్లే.. ఎండీవో విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్‌.. మహిళల వైఖరి ఇదేనా..!

సింగరేణి విషయంలో బీఆర్ఎస్ డొల్లతనాన్ని తాము గమనిస్తున్నామని చెప్పారు. కేటీఆర్‌పై కథనం వస్తే ఒక నీతి? దళిత మహిళపై కథనం వస్తే ఒక నీతా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఇప్పుడు దారుణమైన ట్రెండ్ స్టార్ట్ అయ్యిందని.. మోస్ట్ అన్ పాపులర్ యూట్యూబ్ ఛానెల్‌లో కథనాలు వేసినట్లు శాటిలైట్ చానెల్‌లో వేస్తున్నారని ఆరోపించారు. దళిత ఆడబిడ్డల మీద అలాంటి కథనాలు వేయటంపై తాము ఎంతో బాధపడ్డామన్నారు. గతంలో లైన్ అతిక్రమించిన యూట్యూబ్ చానెల్ వాళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి లైన్ అతిక్రమించిన శాటిలైట్ చానెల్ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసిందని చెప్పారు. అయితే.. జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరును తాము ఖండిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని బీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులకు సపోర్ట్‌గా నిలిచిందని.. కానీ కేటీఆర్ మీద ఇలాంటే కథనాలే వస్తే ఆయన అనుచరులు ఒక చానెల్‌పై దాడి చేశారని పేర్కొన్నారు. అక్కడ మహిళపై కథనాలు వేస్తే దాడి.. ఇక్కడ మహిళలపై కథనాలు వస్తే జర్నలిస్టులకు సపోర్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. మహిళల విషయంలో ఇదేనా మీ వైఖరి అని కేటీఆర్‌ను ప్రశ్నించారు.

మహేశ్‌గౌడ్‌కు నేషనల్ కన్వీనర్ పదవిస్తాం..

ఏ చానెల్‌ను బ్యాన్ చేయడమేంటో కానీ త్వరలోనే ప్రజలు బీఆర్ఎస్‌ను బ్యాన్ చేస్తారని కవిత అన్నారు. అలాగే.. ‘నేను కాంగ్రెస్‌కు వస్తానంటే మహేశ్‌కుమార్‌గౌడ్ వద్దన్నానంటూ చెబుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లూజింగ్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే పార్టీయే జాగృతి పార్టీ. మా పార్టీ కోసం మేము దూందాంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మహేశ్‌గౌడ్‌కు ఉన్న ఎక్స్‌పీరియన్స్ కారణంగా ఆయనకే మేము నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తాం. నేను కాంగ్రెస్‌లోకి వస్తనని ఆయనకు కల వచ్చిందేమో.. ఏదైనా బొట్టు పెట్టించుకోని ఎవరికైనా చూపించుకోవాలి’ అని హితవు పలికారు. తన వ్యక్తిత్వాన్ని బద్నాం చేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని.. తాము చాలా సీరియస్‌గా ప్రజల కోసం పనిచేసే పొలిటికల్ పార్టీగా వస్తున్నామని వెల్లడించారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిపోయిందని.. రెండేళ్లుగా సీరియల్‌గా సాగదీస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి నోటీసులు ఇస్తున్నారా? బాధితులకు నోటీసులు ఇస్తున్నారా? అర్థం కావటం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ డ్రామా చేస్తున్నారని ఆరోపించారు.

Next Story