తెలంగాణలో సంచలనం.. వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కవిత మద్దతుదారులు

by Malleboina Mahesh |

వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత మద్దతుదారుల ప్రభంజనం! 10 వార్డులకు గానూ 8 చోట్ల 'సింహం' గుర్తుపై గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు. గద్వాల గడ్డపై మారిన రాజకీయ సమీకరణాలు.

తెలంగాణలో సంచలనం.. వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కవిత మద్దతుదారులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎవరు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుదారులు భారీ విజయం సాధించడమే కాకుండా మున్సిపాలిటిని కైవసం చేసుకున్నారు. ఈ అనూహ్య ఫలితాలు జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ (Vaddepalli Municipality)లో చోటు చేసుకుంది. ఇక్కడ మొత్తం 10 వార్డులు ఉండగా.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కవిత మద్దతుదారులు 8 వార్డులను కైవసం చేసుకున్నారు. అలాగే మిగిలిని రెండు స్థానాల్లో అధికార కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 వార్డు గెలుచుకున్నారు. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది.

ఈ ఎన్నికల్లో కవిత మద్దతుదారులు 'సింహం' గుర్తుపై స్వతంత్ర పంథాలో బరిలోకి దిగారు. క్షేత్రస్థాయిలో కవితకు ఉన్న ప్రజాధారణ, తెలంగాణ జాగృతి ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు తమకు కలిసి వచ్చాయని గెలిచిన అభ్యర్థులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగగా, వడ్డేపల్లిలో మాత్రం ఒక మూడవ వర్గం మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విజయం కవిత రాజకీయ భవిష్యత్తుకు, ఆమె అనుచరులకు కొత్త ఊపిరి పోసినట్లయింది. ఫలితాలు వెలువడగానే వడ్డేపల్లిలో కవిత మద్దతుదారులు బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

Next Story