తిరోగమనంలో కస్తూర్బా టీచర్లు.!

by Malleboina Mahesh |

మహబూబాబాద్ కేజీబీవీల్లో టీచర్లు బలి! అధికారి మాట నమ్మి రాజీనామాలు.. పదేళ్ల సర్వీసు వృధా. పీజీ సీఆర్టీల భవిష్యత్తుపై నెలకొన్న నీలినీడలు.

తిరోగమనంలో కస్తూర్బా టీచర్లు.!
X

దిశ, మహబూబాబాద్ : జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న కొంత మంది సీఆర్టీ, పీజీ సీఆర్టీ అధ్యాపకుల పరిస్థితి గందరగోళంగా మారింది. జిల్లా విద్యాశాఖలో ఓ అధికారి అత్యుత్సాహం కారణంగా కొంతమంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోయి, ప్రస్తుతం గెస్ట్ ఫ్యాకల్టీ స్థాయికి దిగజారి నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఆర్టీలు, పీజీసీఆర్టీలుగా రిక్రూట్మెంట్ జరిగే క్రమంలో సీఆర్టీ ఉద్యోగానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఐతే స్పష్టమైన మార్గదర్శకాలు లేనప్పటికీ ఓ అధికారి వారిని పురమాయించడంతో కొంతమంది సీఆర్టీలు వారి ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది.

తలపట్టుకున్న టీచర్స్.!

జిల్లాలో కొన్ని కస్తూర్బా పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేశారు. ఐతే సీఆర్టీ గా ఉంటూనే పీజీ సీఆర్టీ పరీక్ష రాసి కొంత మంది ఉపాధ్యాయులు అర్హత సాధించారు. దీంతో కొంతమంది సీఆర్టీ అధ్యాపకులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పీజీ సీఆర్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వారు పీజీసీఆర్టీలుగా బోధనలు కొనసాగిస్తున్నారు. ఐతే గత ఐదు, ఆరు నెలలుగా వారికి జీతాలు రాకపోవడం తో అసలు విషయం ఏమిటని ఆరా తీయగా అసలు నోటిఫికేషన్ వెలువడ లేదన్న వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో కొంతమంది పీజీ సీఆర్టీ అధ్యాపకులు కంగుతిన్నట్టు తెలుస్తుంది. గుడ్డిగా నమ్మి సీఆర్టీ రిజైన్ చేశామని వారు ఆ అధికారిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

పదేళ్ల అనుభవం వృధా...

సీఆర్టీలుగా పదేళ్ల అనుభవం ఒక్కసారిగా విలువ కోల్పోయిందనే భావనతో ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు తెలుస్తుంది. ఓ అధికారి తప్పుడు మార్గనిర్దేశంతో తమ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారిని నిలదీయలేక, బయటకు చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం గెస్ట్ ఫ్యాకల్టీ యే దిక్కు అయినప్పటికీ వచ్చే విద్యా సంవత్సరంలో గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థను తొలగించే అంశంపై కూడా ప్రచారం జరుగుతుండటంతో వారి భవిష్యత్తు మరింత గందరగోళంగా మారనుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా కలెక్టర్ వద్ద ఉన్నట్లు సమాచారం.

నేను రిక్రూట్మెంట్ అధికారిని కాదు: జీ సీడీఓ విజయ కుమారి

కస్తూర్బాలో పరిస్థితులు, ప్రాబ్లమ్స్ గురించి స్టేట్ అధికారులకు కమ్యూనికేట్ చేయడమే తన విధి అని, రిక్రూట్మెంట్ వ్యవస్థ తన చేతుల్లో లేదని కలెక్టర్, డీఈవో, స్టాఫ్ కలిసి నిర్ణయం తీసుకుంటారని జీసీడీఓ విజయ తెలిపారు. అది ఒక టెక్నికల్ ఇష్యూ అని రాష్ట్రంలో ఎక్కడా రిక్రూట్మెంట్ జరగలేదన్నారు.

నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటాం: డీఈవో రాజేశ్వర్

ఈ వ్యవహారంలో సీఆర్టీ, పీజీ సీఆర్టీలకి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. డీఎస్సీకి వివరించాం. ఫైల్ మూవ్ చేయడం జరిగింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం.

Next Story