నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం వైఖరి సరికాదు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

by Kodari Anjali |

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సరికాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం వైఖరి సరికాదు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
X

దిశ, కార్వాన్: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సరికాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి, అణచివేత ధోరణికి నిరసనగా బుధవారం లోక్ భవన్ ముట్టడికి యత్నించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఫిరోజ్ ఖాన్‌లతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా నాంపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. శాంతి యుత నిరసన చేస్తున్న యువకులపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్నీ ఆయన ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలపై శాంతియుతంగా నిరసన చేసిన రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య తీరుకు విరుద్ధం అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

Next Story