ఆర్మూరులో హోరెత్తిన కాంగ్రెస్ నిరసనలు

by Ratna Kumari |

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

ఆర్మూరులో హోరెత్తిన కాంగ్రెస్ నిరసనలు
X

దిశ, ఆర్మూర్ : కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి నిజాంసాగర్ కాలువ వంతెన వరకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు వంతెనపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి మార్ చంద్రమోహన్, పీసీసీ మాజీ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ప్రతిపక్షాల గొంతును అణిచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలకు దిగుతోందని ఆరోపించారు.

ప్రజల హక్కులు, సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం, న్యాయమైన డిమాండ్లతో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకుని, నిర్బంధంలో ఉన్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారి–63పై కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి రఘు, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టం జీవన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మంథని వెంకట్‌రామ్‌రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.కె. చిన్నారెడ్డి, కొంతం మురళి, మాజిద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోత్కూరి లింగా గౌడ్, ఫయీమ్, జిమ్మీ రవి, జన్నపల్లి గంగాధర్, కటికే శ్రీనివాస్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైండ్ల ప్రశాంత్, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story