నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

by Ratna Kumari |

టేకులపల్లి మండల కేంద్రంలోని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ (అశోక్ అన్న వర్గం) పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
X

దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండల కేంద్రంలోని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ (అశోక్ అన్న వర్గం) పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి భానోత్ ఊక్ల మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి రాజీనామా కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజ్యాంగాన్ని చేతబట్టి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై బలప్రయోగం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దేశభక్తి అంటే విద్యార్థులు, యువతపై లాఠీచార్జ్ చేయడమేనా అని ప్రశ్నించిన భానోత్ ఊక్ల, ప్రధాని నరేంద్ర మోడీకి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, లేకపోతే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోందని, దాని పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందో ప్రధాని ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే, ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమ స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత, విద్యార్థులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పడిగా మంగన్న, ఇల్లందు సబ్ డివిజన్ కార్యదర్శి గుగులోత్ రామచందర్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెల్లూరి నాగేశ్వరరావు, ఈసం శ్రీను, ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) నాయకులు ఆళ్లెం లక్ష్మి, బానోత్ సాలి, భూక్య బంగారి తదితరులు పాల్గొన్నారు.

Next Story