బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత.. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు

by Kema Shiva Kumar |

కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది.

బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత.. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka)లో బైక్ టాక్సీ సేవలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు (High Court) ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది వాహనదారులు, ప్రయాణికులు, ఓలా (Ola), ఉబెర్ (Uber), రాపిడో (Rapido) లాంటి అగ్రిగేటర్లకు భారీ ఊరట లభించింది. ఏప్రిల్ 2025లో బైక్ టాక్సీ కార్యకలాపాలను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను చీఫ్ జస్టిస్ విభు బఖ్రూ, జస్టిస్ సీఎం జోషితో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ద్విచక్ర వాహనాలను రవాణా వాహనాలుగా (Transport Vehicles) నమోదు చేయడానికి వాటికి కాంట్రాక్ట్ క్యారేజీ పర్మిట్లు మంజూరు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. బైక్ టాక్సీలు నడపడానికి అనుమతించినప్పటికీ, భద్రత దృష్ట్యా మోటార్ వాహనాల చట్టం ప్రకారం అవసరమైన నిబంధనలు, షరతులను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు నొక్కి చెప్పింది. రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది బైక్ టాక్సీ ఆపరేటర్ల జీవనోపాధిని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ధర్మాసనం వెల్లడించింది.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం బైక్ టాక్సీలను నిషేధించగా.. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాపిడో, ఉబెర్ వంటి సంస్థలు కర్ణాటక హైకోర్లును ఆశ్రయించాయి. గతంలో వీటి వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుందని, భద్రతా సమస్యలు ఉన్నాయని ఆటో యూనియన్లు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, బైక్ టాక్సీలు నిత్యావసరమని, జీవనోపాధి పొందే హక్కు అందరికీ ఉందని కోర్టు అభిప్రాయపడుతూ బైక్ ట్యాక్సీలపై బ్యాన్‌ను లిఫ్ట చేసింది.

Next Story