సకల సౌకర్యాలతో కాప్రా సర్కిల్ మల్లాపూర్ వైకుంఠదామం

by Web Desk |

సకల సౌకర్యాలతో కాప్రా సర్కిల్ మల్లాపూర్ వైకుంఠదామం
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: స్మశాన వాటిక అంటే ప్రతి ఒక్కరికీ భయం, గుబులు పుట్టిస్తుంది. ఇది ఒకప్పటి మాట. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఆందోళనలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో అందమైన వైకుంఠ ధామాలను నిర్మిస్తోంది. వైకుంఠధామాల పట్ల ఉన్న అనుమానాలను తొలగించి రాష్ట్ర సర్కార్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. మానవుల చివరి మజిలీలో పాల్గొనే బంధువులకు సకల వసతులు కల్పించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం.

ఆహ్లాదంగా వైకుంఠదామం..




హైదరాబాద్ మహానగర సంస్థ నగరంలోని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో అందరికంటే ముందుంటుందని నానుడి. మల్లాపూర్ వైకుంఠదామం కూడా ఎవ్వరూ ఊహించని విధంగా తీర్చిదిద్దింది. వైకుంఠదామాన్ని ఆధునిక పద్ధతిలో నిర్మించడం తో చూసే వారు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాప్రా సర్కిల్ మల్లాపూర్ లో సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక వైకుంఠదామం ను సకల సౌకర్యాలతో నిర్మించారు.




మల్లాపూర్ పాత స్మశాన వాటిక అయినప్పటికీ అక్కడ నిర్మించిన సమాధులు కనపడకుండా చుట్టూ పచ్చదనం తో సుందరీకరణ మొక్కలు వినూత్నంగా నాటారు. పురాతన సంప్రదాయం ప్రకారంగానే కట్టెల చితిని నిర్వహిస్తున్నారు. కట్టెలతో కాల్చేందుకు వేర్వేరుగా మూడు చితి లను ఏర్పాటు చేయడమే కాకుండా మూడు వెయిటింగ్ రూం లతో పాటుగా బట్టలు మార్చుకునే గదులను ఏర్పాటు చేశారు.




మహిళలకు, పురుషులకు వేర్వేరుగా స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. త్రాగు నీరు వసతి, ఖాళీ స్థలంలో ఆహ్లాదకరంగా ఉండేలా సుందరీకరణ చేపట్టారు. హిందూ మత గ్రంధాల ప్రకారం అధిపతి శివుడు, యోగ ముద్ర తపస్సు చేస్తున్నట్లు విగ్రహం ఏర్పాటు చేసి చుట్టూ వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఆఫీస్ రూమ్ ను కూడా నిర్మించారు. కాప్రా సర్కిల్ లో 23 కాలనీలలో వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా దహన సంస్కారాల నిర్వహణకు ఇక్కడికి వస్తారని నిర్వాహకులు తెలిపారు.

ప్రత్యేక ఏర్పాట్లు..




వైకుంఠ ధామం ప్రధాన కూడలి ఉన్నందున ప్రహరీ గోడను నిర్మించారు. ప్రార్థన హల్, బూడిద నిల్వ సౌకర్యం, కేశా ఖండన రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వైకుంఠ ధామం లో కావాల్సిన అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు.




హైదరాబాద్ మహా నగరం లో ఇలాంటి సౌకర్యాలు వసతులతో మొత్తం 24 మోడల్ వైకుంఠ దామాలను మొదటి దశలో రూ. 24.13 కోట్ల వ్యయంతో చేపట్టి పూర్తి చేశారు. రెండో దశలో రూ. 25.02 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో 10 మోడల్ వైకుంఠ దామాలను చేపట్టగా అందులో 11 .08 కోట్ల తో వ్యయంతో 5 మోడల్ గ్రేవ్ యార్డులను పూర్తి చేయగా, మరో 5 వైకుంఠ దామాల పనులు వివిధ ప్రగతి దశలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు.

Next Story