వాన దేవుడా కరుణించు.. సిర్సపల్లిలో ఘనంగా 'కప్పతల్లి' పూజలు

by Jakkula.Mamatha |

వర్షాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగంతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వాన దేవుడా కరుణించు.. సిర్సపల్లిలో ఘనంగా కప్పతల్లి పూజలు
X

దిశ,​హుజూరాబాద్ రూరల్: వర్షాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగంతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కరువు కోరల్లో చిక్కుకున్న తమ ప్రాంతాన్ని సుభిక్షం చేయాలని, సమృద్ధిగా వర్షాలు కురిపించాలని కోరుతూ.. హుజూరాబాద్ మండలం సిర్స పల్లి గ్రామంలో గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా "కప్పతల్లి" ఆటలు ఆడి వాన దేవునికి వినూత్నంగా ఆహ్వానం పలికారు.

వీధుల గుండా సాగిన కప్పతల్లి ఊరేగింపు..

​శుక్రవారం ఉదయం నుంచే గ్రామస్థులు, మహిళలు సాంప్రదాయ ముస్తాబులతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రోకలి బండకు కప్పలను వస్త్రంతో (గుడ్డలో) కట్టి, శివాలయం నుండి ప్రారంభమై గ్రామ వీధుల గుండా ఊరేగించారు. "కప్పతల్లి కప్పతల్లి కడవడే నీళ్లు..." అంటూ వర్షాగమనాన్ని ఆకాంక్షిస్తూ పాడిన జానపద గీతాలు గ్రామ వీధుల్లో మారుమోగాయి. ఊరేగింపు ప్రతి ఇంటి ముందుకు వెళ్లినప్పుడు, స్థానిక మహిళలు భక్తిశ్రద్ధలతో కప్పలపై, రోకలి పట్టుకున్న వారిపై బిందెలతో నీళ్లు చల్లి వాన దేవుడిని ప్రార్థించారు.

అన్నదాతల ఆరాటం..

​ముసురు పట్టి పంటలు పండాల్సిన ఈ సమయంలో కరువు ఛాయలు అలముకోవడంతో, ప్రకృతిని శాంతింపజేసేందుకు గ్రామ పెద్దలు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కప్పతల్లి పూజల ద్వారా వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని గ్రామస్థులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ​ఈ వినూత్న సాంప్రదాయ ఉత్సవంలో గ్రామ ఉప సర్పంచ్ జనగామ రాజేశ్వరరావు, గ్రామ పెద్దలు పోల్సాని లింగారావు, ఎడవెల్లి కిషన్ రెడ్డి,బోయినపల్లి తిరుపతిరావు, ఇనుకొండ తిరుపతిరెడ్డి, భజన మండలి అధ్యక్షులు ఎడవల్లి మల్లారెడ్డి,పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు, ప్రజలు అత్యంత ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

Next Story