Kalvakuntla Kavitha: గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-02 15:47:38  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టుకథలేనని.. వేల కోట్ల ఎంవోయూలు చేసుకున్న కంపెనీలకు కనీసం వెబ్ సైట్ దిక్కులేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.

Kalvakuntla Kavitha: గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టుకథలేనని.. వేల కోట్ల ఎంవోయూలు చేసుకున్న కంపెనీలకు కనీసం వెబ్ సైట్ దిక్కులేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వాటిపై తాను చేసిన రీసెర్చ్‌లో చాలా కంపెనీల గుట్టు బయటపడిందని.. హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూల పేరుతో తెలంగాణ యువత ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం మూడుసార్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులకు వెళ్లారని.. ఒకసారి హైదరాబాద్‌లోనే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారని.. వీటి ద్వారా కోట్లాది రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని అన్నారు. ఇప్పుడు సీఎం హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లారని.. అక్కడ చేసిన కోర్సుకు ఫీజు సింగరేణి నుంచి కట్టారా? లేదంటే ఎవరైనా బిజినెస్‌మెన్ ఫీజు కట్టారా? లేదంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్లే ఇన్వైట్ చేశారా? ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే లక్షల కోట్లు వచ్చాయని చెప్పారని.. ట్రంప్ మీడియా టెక్నాలజీ సంస్థ లక్ష కోట్లు పెట్టుబడి అన్నారని.. కానీ ఆ సంస్థ మొత్తం మార్కెట్ విలువనే రూ.30 వేల కోట్లు అని ఆరోపించారు. అది అమెరికాలో ఉన్న సంస్థ అని.. ఆ సంస్థ ద్వారా ఇక్కడ ఎలా పెట్టుబడులు పెడతారో రోడ్ మ్యాప్ లేదని పేర్కొన్నారు.

హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూ

ఏడీఐజీసీ సింగపూర్ గేట్ వే అనే సంస్థ డేటా సెంటర్ ద్వారా 67 వేల కోట్లు పెట్టుబడులు అన్నారని.. కానీ ఆ సంస్థకు కనీసం వెబ్ సైట్ కూడా లేదని అన్నారు. ఇన్ ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్ అనే సంస్థ 70 వేల కోట్లు పెట్టుబడులు అని చెప్పారని.. ఈ కంపెనీని గతేడాది మేలో మాత్రమే పెట్టారని తెలిపారు. ఈ సంస్థ అమెరికాలో రూ.90 వేల కోట్లు, బ్రెజిల్ ప్రభుత్వంతో రూ.70 వేల కోట్లు ఎంవోయూ చేసుకున్నదని.. అంటే ఈ సంస్థ కేవలం ఎంఓయూల కోసమే పెట్టారా? లేదంటే బ్యాంక్‌లను మభ్య పెట్టే పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇక బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ సంస్థ రూ.75 వేల కోట్లు పెట్టుబడి అన్నారని.. అదే సంస్థకు చెందిన మరొక సంస్థ రూ.25 వేల కోట్ల పెట్టుబడి అని చెప్పారని.. కానీ ఈ సంస్థ మార్కెట్ వ్యాల్యూ కన్నా కూడా చాలా ఎక్కువ పెట్టుబడులు పెడతామని చెప్పాయని తెలిపారు. ఇక కుందురూ జయవీర్‌రెడ్డి సంస్థ కూడా రూ.5,600 కోట్ల పెట్టుబడులు అన్నారని.. ఇది నిజమైన కంపెనేనా అనేది జయవీర్‌రెడ్డి చెప్పాల్సి ఉన్నదని వెల్లడించారు. ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ 500 కోట్ల పెట్టుబడి పెడతామని ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాత కంపెనీ పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూలను తెలంగాణ యువత ఎక్స్ పోజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ‘హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎంవోయూ’ పేరుతో తెలంగాణ యువత వీటిని బయట పెట్టాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఒకవేళ నిజంగానే పెట్టుబడులు వచ్చి ఉంటే వాటి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన పెట్టుబడులతో ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో కూడా చెప్పాలని నిలదీశారు. తీసుకొచ్చిన పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక నుంచి ఇలాంటి అనేక అంశాలపై తాము ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్‌ను ఎవరూ కాపాడలేరు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలని కవిత డిమాండ్ చేశారు. అలాగే.. బీఆర్ఎస్ రాచరిక పోకడలు అనుసరిస్తున్నదని.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని.. అందుకే ఆయనను విచారణకు పిలిచారని తెలిపారు. విచారణకు ఎవరిని పిలిచినా సరే వెళ్లాల్సిందేనని.. చట్టాలకు ఎవరూ అతీతం కాదని పేర్కొన్నారు. తాను తప్పు చేయకపోయినా ఈడీ, సీబీఐ విచారణకు వెళ్లానని.. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. కానీ.. కేటీఆర్ మాత్రం కేసీఆర్‌ను అసలు విచారణకే పిలవద్దని అంటున్నారని.. ఇలాంటి రాచరిక పోకడల ఆలోచనలు మారకపోతే బీఆర్ఎస్‌ను ఎవరూ కాపాడలేరని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సాగదీయకుండా విచారణను తుది దశకు తీసుకురావాలన్నారు. అదే విధంగా కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చిందో బీఆర్ఎస్ ఆలోచించుకోవాలని సూచించారు. గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నదని.. అందుకే ఈ కేసులో విచారణ పూర్తి చేస్తారని తనకు నమ్మకం లేదని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే కొన్ని రోజులు ఈ కేసును అటు, ఇటు తిప్పుతున్నారని.. నిజంగా కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లుగా ఎందుకు కేసు ముందుకు పడటం లేదని ప్రశ్నించారు.

సిటీలో పెరుగుతున్న క్రైం

అగ్నిప్రమాదాలు జరిగినా. మహిళలపై దాడులు జరిగినా సీఎం స్పందించరని.. సిటీలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కవిత ఆరోపించారు. 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు సిటీలో చాలా అగ్నిప్రమాదాలు జరిగాయని చెప్పారు. రూబీ హోటల్, దక్కన్ మాల్, స్వప్న లోక్ కాంప్లెక్స్ గుల్జార్ హౌస్‌లో అగ్నిప్రమాదాలు జరిగాయన్నారు. మొన్నటికి మొన్న నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్న పిల్లలు చనిపోయారని.. కానీ సీఎం కనీసం పరామర్శించలేదని అన్నారు. సీఎంగా ఉండి కన్‌సర్న్ చూపించాల్సిందని పేర్కొన్నారు. సీఎం పీఆర్ స్టంట్‌లు మానేసి సెల్లార్‌లో జరిగే బిజినెస్, పాత బిల్డింగ్‌లను మానిటర్ చేయాలని సూచించారు. అటు.. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై అటాక్ జరిగినా కనీసం సీఎం స్పందించలేదన్నారు. ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్లకు వెపన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేశారు. ఇక మహిళలకు హైదరాబాద్ నగరంలో రక్షణ లేకుండా పోయిందని.. ఒక్క ఏడాదిలోనే 69 హత్యలు, 176 హత్యాయత్నాలు జరిగాయని చెప్పారు. దీనికి తోడు గన్ కల్చర్ సైతం మోపైందని.. రెండు రోజుల క్రితం కోటిలో గన్‌తో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. అయినా హోంమంత్రిగా ఉన్న సీఎం మేల్కొలేదన్నారు.

అభ్యర్థిని చూసి ఓటు వేయండి..

మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్‌ని చూసి ఓటు వేయాలని కేటీఆర్ అంటున్నారని.. కేసీఆర్ లేబుల్ చూసి ఓటు వేయాలని కోరడం ఏంటని కవిత ప్రశ్నించారు. మంచోడైనా, చెడ్డోడైనా ఓటు వేయాలనటం మీ నితంతృత్వ, రాచరిక పోకడలకు నిదర్శనమన్నారు. కులం, మతం, చుట్టం, పైసలు చూసి మాత్రం ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. అభ్యర్థి మనకు ఆపదలో ఆదుకుంటాడా లేదా అన్నది చూసి ఓటు వేయాలన్నారు. జాగృతి తరఫున కొన్ని చోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపామని.. తాము మంచి అభ్యర్థులను పెట్టామని.. వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రజలను బీజేపీ ఘోరంగా మోసం చేసిందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు అయినా ఏమీ దక్కలేదన్నారు. దీనిపై యువత ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. 12 ఏళ్లైనా విభజన హామీలను అలాగే పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 47 అంశాలకు సంబంధించి అడిగితే ఒక్కటి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. మోడీ తనకు బడే భాయ్ అంటూ 30 సార్లు సీఎం ఢిల్లీ వెళ్లారని.. కనీసం రూ.30 వేల కోట్లు కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. అదే విధంగా ఈ నెల 20 తర్వాత జనం బాట కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Read More.. హార్వర్డ్ యూనివర్సిటీలో రైజింగ్ తెలంగాణ విజన్‌ను చెప్పారు : కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కౌంటర్

Next Story