నో ఫారిన్ ట్రిప్స్‌.. విద్యాశాఖలోని ఆ ఐఏఎస్‌కు సీఎంవో చెక్!

by Malleboina Mahesh |   (  Updated:2026-07-22 02:15:27  IST  )

విద్యాశాఖలోని ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కు సీఎంవో కార్యాలయం ఝలక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.

నో ఫారిన్ ట్రిప్స్‌.. విద్యాశాఖలోని ఆ ఐఏఎస్‌కు సీఎంవో చెక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యాశాఖలోని ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కు సీఎంవో కార్యాలయం ఝలక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. శాఖపరంగా ఏ ఫారిన్ టూర్ ఉన్నా వెళ్లేందుకు ఉత్సాహం చూపే సదరు ఆఫీసర్‌కు ఈసారి చుక్కెదురైంది. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ఆ ఆఫీసర్ తన కార్యాలయంలో కంటే ఫారిన్ టూర్‌లో ఎక్కువ కాలం ఉంటుందని ఫిర్యాదులు రావడం వల్లే సీఎంవో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రెండు ఫారిన్ టూర్లకు వెళ్లి వచ్చిన ఆఫీసర్ మరో విదేశీ పర్యటనకు వెళితే రెగ్యూలర్ అడ్మినిస్ట్రేషన్‌కు ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

విదేశీ పర్యటనలకు కేరాఫ్..

విద్యాశాఖలో కీలక హోదాలో పనిచేస్తున్న ఓ ఆఫీసర్‌ను ఫారిన్ టూర్ల ఆఫీసర్‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే బాధ్యతలు తీసుకున్న నుంచి ఇప్పటివరకు అత్యధికంగా సంఖ్యలో విదేశీ పర్యటనలకు వెళ్లిన అధికారిగా సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ ఉంది. ప్రైవేటు ఇన్విటేషన్ వచ్చినా, ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా సదరు ఆఫీసరు వెళ్లేందుకు ముందు వరుసలో ఉంటారని ప్రచారం ఉంది. ప్రపంచ దేశాలతో సమానంగా స్టేట్ ఎడుకేషన్ డిపార్ట్‌మెంట్‌ను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. అందుకోసం గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌లో టాప్ -5 కంట్రీస్‌లో అమలు చేస్తున్న విద్యావిధానాన్ని స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఈ మధ్య ప్రభుత్వ ఖర్చులతో ఓ టీంను ఫిన్లాండ్‌కు పంపారు.

ఆ తర్వాత స్విట్జర్లాండ్, జర్మనీకి పంపారు. ఈ రెండు టీమ్స్‌లో విద్యాశాఖలో ఓ కీలక ఆఫీసరు వెళ్లారు. ఈ నెల చివరన జపాన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలో ఆ కీలక ఆఫీసర్ పేరు ముందు వరసలో ఉంది. ఈ విషయాన్ని గమనించిన సీఎంవో అధికారులు ఒకే ఆఫీసర్ వరుసగా విదేశీ పర్యటనకు వెళ్లిన విషయాన్ని సీఎం రేవంత్‌కు వివరించగా, ఆ ఆఫీసర్ పేరును పక్కన పెట్టాలని సీఎం ఆదేశించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ లిస్టులోని మిగతా అధికారులు, వర్సిటీల వీసీల పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

Next Story