ఉపాధి హామీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు పెండింగ్

by Malleboina Mahesh |

ప్రతి నెలా 1వ తేదీన అన్ని విభాగాల్లోని ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు చెల్లించాలని సీఎం ఆదేశించినా వారి ఖాతాల్లో జమ కావడం లేదు.

ఉపాధి హామీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు పెండింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను పలువురు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రతి నెలా 1వ తేదీన అన్ని విభాగాల్లోని ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు చెల్లించాలని సీఎం ఆదేశించినా వారి ఖాతాల్లో జమ కావడం లేదు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడంపై ముఖ్యమంత్రి ఇటీవల రివ్యూ చేసి సంబంధిత శాఖ అధికారులపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. ప్రతి ఉద్యోగికి కచ్చితంగా ఒకటో తేదీనే జీతం ఇచ్చి తీరాలని ఆదేశించారు. అయినా.. సీఎం ఆదేశాలను ఉన్నతాధికారులు అమలు చేయడం లేదని తెలుస్తోంది.

ఉపాధి హామీ సిబ్బందికి 3 నెలలుగా జీతాలు రాకపోవడమే ఇందుకు ఉదాహరణ. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి, కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించే కీలక బాధ్యతను నిర్వర్తించే ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు అందడం లేదు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న వీరికి, 3 నెలలు గడిచినా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ‘వీబీ జీ రామ్‌ జీ’ పథకం అమలు కోసం రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సుమారు 12 వేల మంది వరకు పని చేస్తున్నారు. గ్రౌండ్ లెవల్‌లో పనులను గుర్తించి లక్ష్యం చేరేలా వీరు కృషి చేస్తారు.

పట్టించుకోని ఉన్నతాధికారులు..

క్షేత్రస్థాయిలో కూలీలకు పనులు కల్పించడం మొదలు.. మస్టర్లలో పేర్ల నమోదు, పని ప్రదేశంలో ఫోటోలు తీయడం, కొలతలు తీసుకోవడం, పనులు, కూలీల వివరాలు ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. కానీ వీరికి వేతనాలు సకాలంలో ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. గతంలో పదో తేదీలోగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమయ్యేవి. కానీ 3 నెలలుగా వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల గురించి ఉన్నతాధికారులను అడిగితే.. సాంకేతిక సమస్యలు అంటూ ఏవో కారణాలు చెబుతున్నారని అంటున్నారు. వేతనాలు రాకపోవడంతో పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎంఐలు కట్టడం కోసం బయట అప్పులు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సకాలంలో జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు.

Next Story