నల్లమలలో కలుషిత నీటి కలకలం.. అమ్రాబాద్, పదర మండలాల్లో ఆందోళన

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-22 02:07:15  IST  )

నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కలుషిత తాగునీరు సరఫరా అవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అమ్రాబాద్, పదర మండలాల్లో మిషన్ భగీరథ కుళాయిల నుంచి మురుగు నీరు రావడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నల్లమలలో కలుషిత నీటి కలకలం.. అమ్రాబాద్, పదర మండలాల్లో ఆందోళన
X

నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కలుషిత తాగునీరు సరఫరా అవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అమ్రాబాద్, పదర మండలాల్లో మిషన్ భగీరథ కుళాయిల నుంచి మురుగు నీరు రావడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలుషిత నీటి వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని చిన్నారులు, గర్భిణుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. పైప్‌లైన్ లీకేజీలు సరిచేసి శుద్ధజలాలు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నా, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కుంటిసాకులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై విద్యాధికులు, అధికారులు వివక్ష చూపుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నీటి నాణ్యతా పరీక్షలు జరిపి, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- దిశ, అచ్చంపేట

దిశ, అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు తీవ్రంగా కలుషితమవుతోందని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కుళాయిల నుంచి మురగు, కలుషిత నీరు వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యమేలా?

ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఇలాంటి కలుషిత నీటినే తాగాల్సిన దుస్థితి నెలకొనడంతో డయేరియా, టైఫాయిడ్, తీవ్ర జ్వరాలు వంటి భయంకరమైన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అధికారులు ఇంతటి గంభీరమైన సమస్యను ఏమాత్రం పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.

శుద్ధ నీటిని సరఫరా చేయాలి..

ప్రస్తుతం వస్తున్న కలుషిత నీటి సరఫరాను తక్షణమే నిలిపివేసి, నీటి పైప్‌లైన్లలో ఉన్న లీకేజీలను పరిశీలించి శుద్ధమైన తాగునీటిని అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తాగునీటి నాణ్యతపై ప్రత్యేక నీటి పరీక్షలు నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఈ తీవ్రమైన సమస్యను మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు కుంటిసాకులు చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే, గ్రామాలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Next Story