- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టాంప్ డ్యూటీలో అంకెల గారడీ.. ఒకే ట్రాన్సాక్షన్, చలాన్లు రెండు!
అంకెల గారడీతో కొందరు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేందుకు యత్నిస్తున్నారు. చలానాలను మార్ఫింగ్ చేసి సర్కారు వెబ్‌సైట్‌కే కన్నమేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అంకెల గారడీతో కొందరు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టేందుకు యత్నిస్తున్నారు. చలానాలను మార్ఫింగ్ చేసి సర్కారు వెబ్ సైట్‌కే కన్నమేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘భూభారతి’లో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీ స్కాంలో కొత్తకోణం బయటపడింది. ట్రాన్సాక్షన్‌కు చెల్లించాల్సిన పూర్తిసొమ్ములో నుంచి చివరి అంకెను తొలగించి ఈ చలానాను చెల్లించడం బహిర్గతమైంది. భూభారతి వెబ్‌సైట్ నే చీట్ చేసి స్లాట్ బుక్ చేయడం జనగామ జిల్లాలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇది ఎక్కువగా యాదగిరిగుట్టకు చెందిన టెక్నికల్ నాలెడ్జ్ కలిగిన వారితోనే చోటుచేసుకున్నదని రెవెన్యూ అధికారులు గుర్తించారు. వారి నుంచి రికవరీ ప్రక్రియ మొదలైంది. ఈ దోపిడీ జనగామ జిల్లాకే పరిమితం కాలేదు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనూ వెలుగుచూసింది. మొదటి రెండేసి ఈ చలానాలను ఎంట్రీ చేసి మొదటి చలానా మాత్రం అతి తక్కువ అమౌంట్, రెండవది మిగతా అమౌంట్‌తో సరిచేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి దందా ఎన్ని లావాదేవీల్లో జరిగిందో కూపీ లాగే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సాఫ్ట్ వేర్‌ను పకడ్బందీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని స్టాంప్ డ్యూటీ ఎగవేత అంశం స్పష్టం చేస్తున్నది.
రెండు చలానాలతో మోసం..
జోగుళాంబ గద్వాల జిల్లాలో స్టాంప్ డ్యూటీ లో వ్యత్యాసాలను 43కు పైగా ట్రాన్సాక్షన్లలో గు ర్తించారు. అయితే వీటిలో కొన్ని రూ.50, రూ. 60, రూ.90, రూ.100, రూ.191, రూ.300 చొప్పున చెల్లించినట్లు ఉన్నాయి. వీటిలో మొదటి చలాన్ మాత్రమే ట్రాన్సాక్షన్ ఐడీలో కనిపిస్తున్నది. దానికి రెండో ఈ చలానా సైతం ఉందని అధికారులు గుర్తించారు. అయితే మొదటి ఈ చ లానా, రెండో ఈ చలానాకు మధ్య చాలా రోజుల గ్యాప్ ఉంది. ఈ మధ్యకాలం ఎక్కువగా ఉండడా నికి గల కారణాలేమిటని రెవెన్యూ అధికారులు ఆరాతీశారు. మొదట కొనుగోలు చేసిన వ్యక్తిని విచారిస్తే తాను పూర్తి స్టాంప్ డ్యూటీ చెల్లించానన్నాడు. ఆ తర్వాత మీ సేవ నిర్వాహకులను ఏయే ట్రాన్సక్షన్లలో తేడాలు వచ్చాయో, ఆ డేటా ప్రకారం ఈ చలానాల వివరాలను తీసుకురావాలని సూచించారు. ఆ మేరకు అన్ని ట్రాన్సాక్షన్ల డేటాను అధికారులకు సమర్పించారు. వీటిలో చాలా వరకు రెండేసి ఈ చలానాలను ఎంట్రీ చేసినట్లు గుర్తించారు. అయితే మొదటి చలానా మాత్రం అతి తక్కువ అమౌంట్‌తోనే ఉంది. రెండోది మిగతా అమౌంట్‌కు సమానంగానే ఉంది. ఇలా ఎందుకు చేశారు? ఎలా సాధ్యమైంది? అని అధికారులు విచారించారు.
ఆపరేటర్ల మధ్య పోటీ..
ఎవరైనా కస్టమర్ రాగానే ట్రాన్సాక్షన్ వివరాలు తీసుకోవడం, వెంటనే స్లాట్ టెంపరరీగా బుక్ చేయడం.. ఆ తర్వాత ట్రాన్సాక్షన్‌కు ఎంత అమౌంట్ అవుతుందో లెక్కించి మీసేవ నిర్వాహకులు చెబుతున్నారు. అతను కేవలం అమౌంట్ ఎంతవుతుందో తెలుసుకోవడానికే వచ్చినా నిర్వాహకులు మాత్రం స్లాట్ బుక్ చేసినట్లు రిసీట్ ఇచ్చేస్తారు. అందులో ఈ చలానా అమౌంట్ ఏమీ ఉండదు. కానీ స్లాట్ బుక్ చేసినట్లు కనిపిస్తుంది. అతను గత్యంతరం లేక రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులకు పెట్టుకున్నా ఆ మీ సేవ నిర్వాహకుడి వద్దకే వెళ్తాడు. రెండో ఈ చలానాలో మిగతా మొత్తాన్ని కట్టేస్తున్నారు. అయితే ధరణి, భూ భారతి సాఫ్ట్ వేర్‌లో ఒక ట్రాన్సాక్షన్‌కు ఎన్ని చలానాలనైనా యాడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ టెక్నికల్ నాలెడ్జ్ సంపాదించుకున్న మీ సేవ నిర్వాహకులు మాత్రమే ఈ తరహా దందాకు పాల్పడుతున్నారు. గద్వాల జిల్లాలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకున్నది. కొన్ని మాత్రమే స్టాంప్ డ్యూటీని ఎగ్గొట్టినట్లు గుర్తించారు. సదరు కొనుగోలుదారుల నుంచి వివరాలను కూపీ లాగుతున్నారు. అయితే తమ మధ్య నెలకొన్న పోటీతత్వంతోనే ఇలా చేశామని మీసేవ ఆపరేటర్లు అధికారులకు వివరించారు.
సాఫ్ట్‌వేర్ కొత్త చిక్కులు
ఓ సేల్ డీడ్‌లో 2021 జూన్ 8న ట్రాన్స్‌ఫర్ డ్యూటీ అమౌంట్ మైనస్ చూపించింది. దీంతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి అమౌంట్ సిస్టం జనరేట్ చేసింది. ట్రాన్స్‌ఫర్ డ్యూటీ మైనస్‌గా ఎందుకొచ్చిందనే విషయం తెలియదు. ఈ చలానాలో ట్రాన్స్‌ఫర్ డ్యూటీ మైనస్‌గా చూపింది. ఏదైనా జిల్లా, డివిజన్, మండలం, ఊరు, సర్వే నంబర్, విస్తీర్ణం సెలెక్ట్ చేసుకుంటే.. దానికి స్టాంప్ డ్యూటీ, మ్యుటేషన్ చార్జీ, పట్టాదారు పాసుబుక్, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, హరితనిధి.. మొత్తం ఎంత అమౌంట్ అనేది కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ సమ్మరీ ఒక పేజీలో ప్రింట్ అవుతుంది. దానికి సరిపడా ఈ చలాన్‌లో అమౌంట్ ఉండాలి. ఈ రెండింటి మధ్య సిస్టం నుంచి వేర్వేరుగా అమౌంట్స్ వచ్చినప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? స్లాట్ బుక్ చేసిన వ్యక్తి బాధ్యత వహిస్తారా? సాఫ్ట్ వేర్ ఆపరేటర్ దా? అనేది లెక్క తేలాలి. ఈ అంశం పూర్తిగా సాఫ్ట్ వేర్ సొల్యూషన్ తేల్చాల్సిందే. ఈ లెక్కల్లో తేడాలు ఎందు కొచ్చాయో గుర్తించలేదని సమాచారం.
ల్యాండ్ ఓ జిల్లా.. బుకింగ్ మరో జిల్లా
రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 69 క్రయవిక్రయాల్లో అధికారులు తేడాలను గుర్తించారు. అయితే అన్నింటిని విచారిస్తే రెండో చలానా ఉన్నట్లు గుర్తించారు. కానీ 2025 జులై 2న చేసిన ఓ ట్రాన్సాక్షన్‌లో స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, పట్టాదారు పాసుబుక్ చార్జీలు, మ్యుటేషన్ చార్జీలు, హరితనిధి.. అన్ని కలిపి రూ.15,039. కానీ బ్యాంకులో రూ.1,503 మాత్రమే బ్యాంకులో చెల్లించి ఈ చలానా జనరేట్ చేశారు. అంటే ఇక్కడ పక్కాగా మోసం జరిగినట్లు తేలింది. ఒకే ట్రాన్సాక్షన్‌లో ఏకంగా రూ.13,536 నొక్కేశారు. ఆ సేల్ డీడ్ ప్రకారం కొనుగోలుదారుడిని గుర్తించి అధికారులు విచారించారు. తాను మాత్రం ఫోన్ పే ద్వారా రూ.14,438 పంపించానని చెప్పాడు. ఈ స్లాట్ చౌటుప్పల్ మండలానికి చెందిన మీ సేవ ఆపరేటర్‌కు పంపినట్లు ఆధారాలు చూపాడు. ఇప్పుడు ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారో చూడాలి. అలాగే మరో మండలంలో 16 ట్రాన్సాక్షన్లలో ఒక్కటి మాత్రమే తేడా ఉంది. అది రూ.1,42,683 కట్టాల్సిన ఈ చలానాను రూ.1,16,376 మాత్రమే కట్టారు. ఇక్కడ రూ.26,307 కొట్టేశారు. 80 కి.మీ. దూరంలో ఉన్న చౌటుప్పల్‌కు చెందిన వ్యక్తి ఈ దందాకు పాల్పడ్డాడు. ల్యాండ్ ఒక జిల్లా, స్లాట్ బుక్ చేసింది మరో జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. మరో మండలంలో పది ట్రాన్సాక్షన్లను పరిశీలిస్తే నాలుగింట తేడాలను గుర్తించారు. ఇప్పుడు మిగతా అమౌంట్‌ను కలెక్ట్ చేసే పనిలో తహశీల్దార్లు ఉన్నారు. దాదాపు అన్ని మండలాల్లోనూ ఇలాంటి తేడాలు ఉన్నట్లు తేలింది. వాటిపై అధికారులు దృష్టి సారించారు.
అతి తక్కువ అమౌంట్‌తో స్లాట్ బుక్ చేసిన లిస్ట్ ఇలా..






