ఎస్‌బీఐ 'కాంప్రెన్సీవ్ పెన్షన్ ప్రాజెక్టు'లో చేరండి

by Ratna Kumari |

కాంప్రెన్సీవ్ పెన్షన్ ప్రాజెక్టులో చేరి బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ సూచించారు.

ఎస్‌బీఐ కాంప్రెన్సీవ్ పెన్షన్ ప్రాజెక్టులో చేరండి
X

దిశ, మహబూబ్‌నగర్ ప్రతినిధి : 70 ఏళ్ల లోపు వయస్సు గల రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అమలు చేస్తున్న 'కాంప్రెన్సీవ్ పెన్షన్ ప్రాజెక్టు (CPP)'లో చేరి బీమా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ సూచించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని టీఎన్‌జీఓ సంఘ భవనంలో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీపీపీలో చేరిన పెన్షనర్లకు రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుందని, ఇందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే పెన్షనర్ పెన్షన్ ఖాతా, సేవింగ్స్ ఖాతా తదితర బ్యాంకింగ్ లావాదేవీలు ఎస్‌బీఐలోనే ఉండాలని పేర్కొన్నారు.

సేవింగ్స్ ఖాతాను సీపీపీలోకి మార్చుకోవడానికి ఆధార్ కార్డు, పీపీఓ నంబర్ కాపీ, పాన్ కార్డు అవసరమవుతాయని వివరించారు. 70 ఏళ్లలోపు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉచిత బీమా సౌకర్యాన్ని పొందాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు సాయిల్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసులు నాయక్, జాఫర్ మొహినోద్దీన్ మెహతార్, సత్యప్రకాష్ ఆర్య, వైస్ ప్రెసిడెంట్ బాలకిషన్, ప్రధాన కార్యదర్శి అంజయ్యచారి తదితరులు పాల్గొన్నారు.

Next Story