- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి : జాన్ వెస్లీ
బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, నిష్పక్షపాత విచారణ జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు, అత్యాచారానికి పాల్పడటం అత్యంత హేయమైన చర్యమని, ఈ ఘటనకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలని, నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మైనర్ బాలికపై జరిగిన ఈ దారుణంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు, పౌర సమాజం నిరసనలు తెలుపుతున్నా, నిందితుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనప్పటికీ, పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. పోలీసు యంత్రాంగంపై వస్తున్న రాజకీయ ఒత్తిళ్లే కారణమని, బీజేపీ పలుకుబడిని ఉపయోగించి కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. న్యాయానికి, చట్టానికి కట్టుబడి ఉంటానని చెప్పే బండి సంజయ్, తన కొడుకుని రహస్యంగా ఉంచి బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగడం బాధ్యతారాహిత్యమని, నిజంగా చట్టంపై గౌరవం ఉంటే వెంటనే తన కుమారుడిని పోలీసులకు సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి, డీజీపీ తక్షణమే జోక్యం చేసుకుని నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
నీట్ ప్రశ్నాపత్రం లీజేజిపై సమగ్ర విచారణ జరపాలి..
నీట్ యూజీ--2026 మే 3న ప్రశ్నాపత్రం లీక్ కావడం దేశ విద్యా వ్యవస్థకు తీరని మచ్చ అని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి లీకేజిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. వరుసగా జరుగుతున్న లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని, మొత్తం 720 మార్కులలో దాదాపు 600 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు (సుమారు 15 కీలక ప్రశ్నలు) ముందే లీక్ అయ్యాయని, ముఖ్యంగా కెమిస్ట్రీ విభాగంలో భారీగా అవకతవకలు జరిగాయని తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించిన కోచింగ్ మాఫియా వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, విద్యలో కార్పొరేటీకరణ ప్రవేశించిన తర్వాత ఇలాంటి ఘటనలు తరచుగా సంభవిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్‌తో సమగ్ర దర్యాప్తు జరిపించాలని, లీకేజీకి కారణమైన అధికారులు, మాఫియాలను కఠినంగా శిక్షించాలని, అశాస్త్రీయమైన పరీక్షా విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.






