- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలిసారి భారత్ పర్యటనకు జపాన్ ప్రధాని
జపాన్ నూతన ప్రధాని సనాయె తకాయిచి(Sanae Takaichi) తొలిసారి భారతదేశంలో పర్యటించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : జపాన్ నూతన ప్రధాని సనాయె తకాయిచి(Sanae Takaichi) తొలిసారి భారతదేశంలో పర్యటించనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జులై 1 నుండి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్న ప్రతిష్టాత్మక 'భారత్-జపాన్ 16వ వార్షిక సదస్సు' (India-Japan Annual Summit)లో ఆమె పాల్గొంటారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆమె ఈ సదస్సుకు విచ్చేస్తున్నట్లు భారత విదేశాంగశాఖ అధికారికంగా వెల్లడించింది. సనాయె తకాయిచి జపాన్ ప్రధాని హోదాలో భారతదేశ పర్యటనకు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం
ఈ ఉన్నత స్థాయి సదస్సు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ రంగ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని తకాయిచిలు పరస్పర ప్రయోజనాలతో కూడిన అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. వీటితో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వంతో కూడిన ప్రాంతీయ అంశాలు, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలపై ఇరు దేశాధినేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
దౌత్య సంబంధాలు కీలకం
భారత్, జపాన్ దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఏటా ఈ ద్వైపాక్షిక వార్షిక సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో అత్యంత విజయవంతంగా 15వ భారత్-జపాన్ వార్షిక సదస్సు జరిగింది. ఆ సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హాజరై జపాన్ పాలకులతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 16వ సదస్సు భారత్‌లో జరగబోతుండటం ఇరు దేశాల దౌత్య సంబంధాలలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.






