ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్

by Malleboina Mahesh |   (  Updated:2026-04-19 12:08:01  IST  )

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా! ప్రధాని పలకరింపుపై హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)కు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో ప్రధాని 'X' (ట్విట్టర్) వేదికగా.. పవన్ కల్యాణ్ ఎంతో ధైర్యవంతుడు. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆయన క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.

కాగా ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌కు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. "గౌరవనీయ ప్రధాని మోడీ నా శస్త్రచికిత్స తర్వాత మీరు స్వయంగా ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి ఆరా తీసినందుకు, మీరు చూపిన చొరవకు ధన్యవాదాలు. మీ ప్రేమపూర్వక మాటలు, ప్రోత్సాహం, శుభాకాంక్షలు నాకు గొప్ప శక్తిని ఇస్తున్నాయి. మీ మార్గనిర్దేశం, మద్దతు, ప్రార్థనలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని" అని పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స (Surgery) నిర్వహించినట్లు జనసేన పార్టీ వర్గాలు ధృవీకరించాయి. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పవన్, శుక్రవారం అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యుల సూచన మేరకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Next Story