దోచుకో.. దాచుకో.. పంచుకో అనేలా కాంగ్రెస్ పాలన: జగదీశ్‌రెడ్డి

by Gantepaka Srikanth |

రెండేళ్ల కాంగ్రెస్ పాలన దోచుకో.. దాచుకో.. పంచుకో.. అన్నట్లుగా సాగుతున్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు.

దోచుకో.. దాచుకో.. పంచుకో అనేలా కాంగ్రెస్ పాలన: జగదీశ్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండేళ్ల కాంగ్రెస్ పాలన దోచుకో.. దాచుకో.. పంచుకో.. అన్నట్లుగా సాగుతున్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం, మంత్రుల మధ్య దోచుకున్న పంచాయితీ నడుస్తున్నదని ఆరోపించారు. ఈ గొడవ మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి మొదలైందని తెలిపారు. ఓ మంత్రి తనకు తెలియకుండానే జీవోలు అమలవుతున్నాయని చెప్పారని.. మరో మంత్రి కొండా సురేఖ కూతురు స్వయంగా సీఎం, రెవెన్యూ మంత్రిపై ఆరోపణలు చేశారని అన్నారు. మరో మహిళా మంత్రి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నందుకు ఏకంగా పీఏను తొలగించారని.. సినిమా టికెట్ రెట్లు పెంచిన సంగతి తనకు తెలియదని మరో మంత్రి బహిరంగ చెప్పారని అన్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. ఒక్కరు కూడా హామీలపై మాట్లాడింది లేదని తెలిపారు. దోచుకున్న డబ్బుల పంచాయితీలు రోజుకొకటి బయటపడుతున్నాయని.. చివరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక మీడియాలో మంత్రులు, అధికారుల వీడియోలు.. మరో మీడియాలో ఇంకో రకమైన వీడియోలు వచ్చాయని.. ఈ గొడవల మధ్య పాలన పారదర్శకంగా నడుస్తున్నదని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు పట్టిన గతే ఆయనకూ..

పరిపాలన వదిలేసి నిచానికి దిగజారుతున్నారని అన్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, కోమటిరెడ్డిపైనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. నాడు చంద్రబాబు కూడా ఇలానే మాట్లాడారని.. ఆయనను పాతాళలోకానికి ప్రజలు పాతరేశారని హెచ్చరించారు. చంద్రబాబు వైఖరిని కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొన్నారు తప్పా వ్యక్తగత ఆరోపణలు చేయలేదన్నారు. కేసీఆర్ కాలి గోటికి సైతం రేవంత్‌రెడ్డి సరిపోరన్నారు. తొందరలోనే ఆయన అధికార కోట కూలుతుందని.. చంద్రబాబుకు పట్టిన గతే ఆయనకూ పడుతుందని అన్నారు. చంద్రబాబును పారద్రోలారని.. రేవంత్‌‌రెడ్డిని పాతరేయడం ఖాయమన్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొట్టండి చూద్దామని హెచ్చరించారు. సీఎం మాటలపై డీజీపీ, ఖమ్మం సీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, బీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Next Story