బెల్లంపల్లి గురుకుల ఘటన పై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడం హర్షణీయం

by Batti.Sumithra |

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన పై తెలంగాణ ప్రభుత్వం స్పందన.

బెల్లంపల్లి గురుకుల ఘటన పై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడం హర్షణీయం
X

దిశ, హిమాయత్ నగర్ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన పై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్‌లను సస్పెండ్ చేయడం హర్షణీయమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటన పై బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ ఫిర్యాదును కమిషన్ ఈనెల 24 న డైరీ నెం. 1164/ఐఎన్/2026గా నమోదు చేసిందని వెల్లడించారు. అలాగే ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పాటు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. తన ఫిర్యాదు అనంతరం ప్రభుత్వం వేగంగా స్పందించి బాధ్యుల పై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం విద్యార్థుల భద్రత పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు.

ప్రజల సమస్యల పై స్పందించి వెంటనే చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే కేవలం సస్పెన్షన్‌తోనే వ్యవహారం ముగియకుండా, ఘటనకు దారితీసిన అసలు కారణాల పై ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణ జరిపి బాధ్యుల పై కఠిన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురుకుల విద్యాసంస్థల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్న ఆయన, విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి ప్రమాణాలు, వంటశాల నిర్వహణ, ఆహార నిల్వవిధానాల పై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. బెల్లంపల్లి ఘటన రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాసంస్థలకు ఒక హెచ్చరికగా నిలవాలని, ఇక పై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని దుండ్ర కుమారస్వామి సూచించారు.

Next Story