తెలంగాణలో నామినేటెడ్ పదవుల రెన్యూవల్ టెన్షన్.. సీఎం రేవంత్ ‘నయా ఫార్ములా’!

by Prasad Jukanti |   (  Updated:2026-07-27 12:05:12  IST  )

తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీపై ఉత్కంఠ నెలకొంది. పాత, కొత్త ఆశావహుల ఒత్తిడిని అధిగమించేందుకు సీఎం రేవంత్ సరికొత్త వ్యూహం అమలుచేయబోతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో నామినేటెడ్ పదవుల రెన్యూవల్  టెన్షన్.. సీఎం రేవంత్ ‘నయా ఫార్ములా’!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల చైర్మన్ల పదవులపై భర్తీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 2024 జులైలో మొత్తం 37 మందికి ప్రభుత్వం కార్పొరేషన్ పదవులు ఇచ్చింది. వీరి రెండేళ్ల కాలపరిమితి పూర్తయింది. దీంతో ఖాళీ అయిన ఈ స్థానాలతో పాటు పెండింగ్‍లో ఉన్న మరో 50కి పైగా కార్పొరేషన్ చైర్మన్ల భర్తీకి టీపీసీసీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో పదవులు తిరిగి దక్కించుకునేందుకు, ఎలాగైనా తమ టర్మ్ ను మరో దఫా రెన్యూవల్ చేయించుకునేందుకు తాజా మాజీ చైర్మన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పార్టీ పెద్దలు, తమ గాడ్ ఫాదర్ల వద్దకు క్యూ కడుతుండగా మరికొందరు ఏకంగా ఏఐసీసీ స్థాయిలో లాబీయింగ్ చేయిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మాకూ ఓ చాన్స్ ఇవ్వండి ప్లీజ్..

అయితే మొదటిసారి పదవులు ఇచ్చాక ఆయా సంస్థల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకుని పట్టు సాధించేందుకే ఇంత సమయం పట్టిందని ఇంతలోనే పదవీ కాలం ముగిసిపోవడంతో ఇక తమ మార్క్ ఎలా చూయించుకోగలమంటూ తాజా మాజీ చైర్మన్లు ఆవేదన వెల్లి బుచ్చుకుంటున్నారట. అందువల్ల మరోసారి తమకే అవకాశం కల్పిస్తే తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు అవకాశం దక్కినట్లు అవుతుందని పార్టీ పెద్దల వద్ద తమ గోడును వినిపిస్తున్నారట. అయితే మళ్లీ పాతవారికే అవకాశం కల్పిస్తే తమ పరిస్థితి ఏంటి అనే ఒత్తిడి ఆశావహుల నుంచి పార్టీ పెద్దలపై పెరుగుతోందనే చర్చ వినిపిస్తోంది. కష్టనష్టాల్లో పార్టీకి వెన్నంటి ఉన్నామని, పార్టీనే నమ్ముకుని ఉన్న తమకు ఒక్క చాన్స్ ఇవ్వాలని లేదంటే పార్టీ కోసం పని చేసి ప్రయోజనం ఏంటనే ఆవేదన పదవులు ఆశిస్తున్న వారి నుంచి వ్యక్తం అవుతోందట. దీంతో తాజా మాజీలు, కొత్త ఆశావహుల మధ్య మింగమంటే కప్పకు కోపం వద్దంటే పాముకు కోపం అన్న చందంగా పార్టీ పెద్దల పరిస్థితి తయారైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సీఎం నయా ఫార్ములా:

ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నయా ఫార్ములా తెరపైకి తీసుకువచ్చినట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విడతలో పలువురికి తిరిగి రెన్యువల్ కాకపోయినా, సీనియర్ నాయకులకు పదవులు దక్కకపోయినా పార్టీలో అసమ్మతి, తిరుగుబాటు రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకత్వం ఒక కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో నామినేటెడ్ పదవులు దక్కని సీనియర్ నాయకులకు వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా హామీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు దక్కని సీనియర్లకు భవిష్యత్తులో అసెంబ్లీ లేదా లోక్‌సభ టికెట్ ఇస్తామని ముందస్తు హామీ ఇవ్వడం ద్వారా పార్టీలో అంతర్గత విభేదాలు, అసంతృప్తులు తలెత్తకుండా అడ్డుకోవచ్చని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అంగీకరించేదెంతమంది?:

డిలిమిటేషన్ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119 నుండి 182కి పెరిగే అవకాశం ఉంది. అలాగే లోక్‌సభ స్థానాల సంఖ్య కూడా 17 నుండి 26కి పెరగనున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కళ్ళముందున్న నామినేటెడ్ పదవిని కాదని భవిష్యత్తులో ఇస్తామనే టికెట్ హామీకి ఎంత మంది అంగీకరిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు, పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్న నేతలు ఫ్యూచర్ సంగతి అప్పుడు చూద్దాం ఇప్పుడైతే ఈ చాన్స్ వదిలిపెట్టకూడదనే పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేసేందుకు పీసీసీ కసరత్తు చేస్తుండగా ఇందులో ఎవరికి పదవులు మోక్షం దక్కనుందో చూడాలి.

Next Story