మేడిగడ్డ నీటిని తరలించకపోవడం దుర్మార్గం

by Ratna Kumari |

కరీంనగర్‌లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు.

మేడిగడ్డ నీటిని తరలించకపోవడం దుర్మార్గం
X

దిశ, కొత్తపల్లి : కరీంనగర్‌లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. జిల్లా కేంద్రంలోని కొండా సత్యలక్ష్మి వేదికలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరుకాగా, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలపై హరీశ్‌రావు విమర్శలు..

హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు ఎంపీగా గెలిచిన గడ్డ కరీంనగర్ అని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో విఫలమైందని ఆరోపించారు. మేడిగడ్డ నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం రాజకీయ కారణాలతో నీటిని వినియోగించకుండా నిలిపివేసిందని విమర్శించారు. కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు అందించారని, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు మేలు చేయకుండా కేసీఆర్‌పై విమర్శలు చేయడం తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

కేసులకు భయపడేది లేదు: గంగుల కమలాకర్..

మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తనను నాలుగుసార్లు గెలిపించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని, అయితే ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేసిన తమపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు కూడా ఎలాంటి కేసులకు భయపడవద్దని, తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులను రద్దు చేస్తామని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి..

రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై హరీశ్‌రావు పార్టీ నాయకులకు కీలక సూచనలు చేశారు. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ ప్రక్రియలో బీఎల్‌ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఓట్లు గల్లంతు కాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే ఓటు హక్కు కోల్పోయే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు, పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, సర్దార్ రవీందర్ సింగ్, చల్ల హరిశంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story