శ్రీశైలం హైవే ఫర్‌ సేల్‌?

by Muthe.Rajitha |

శ్రీశైలం హైవే భూముల పట్టా ఇంకా రైతుల పేరిటనే ఉండటం వలన కొందరు దళారులు రహదారి భూములను సైతం అమ్మకానికి పెట్టారు.

శ్రీశైలం హైవే ఫర్‌ సేల్‌?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: అమ్మకానికి హైవే భూములు. అవును మీరు వింటున్నది నిజమే. శ్రీశైలం హైవే-765కు సంబంధించిన భూములను కొందరు అమ్మకానికి పెట్టారు. ఎన్నో ఏండ్ల క్రితం నిర్మించిన హైవే కోసం ఇచ్చిన పట్టా భూములను రికార్డుల్లోంచి తొలగించకపోవడం.. ఇప్పటికీ ఆయా రైతుల పేర్లు ఆన్‌లైన్‌‌లో కన్పిస్తుండడమే ఇందుకు కారణం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుడ్డిగా హైవేకు సంబంధించిన భూములకు రైతు బంధు ఇస్తూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గుర్తించి ఆయా భూములకు రైతు బంధును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ.. రికార్డుల్లో విస్తీర్ణాన్ని తగ్గించలేదు. దీంతో రైతు భరోసా కూడా రోడ్డులో పోయిన భూమికి యథావిధిగా వస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో.. ఇదే అదనుగా రోడ్డు నిర్మాణంలో ఉన్న భూములపై కొందరు దళారులు కన్నేశారు.

దళారుల చేతుల్లో హైవే భూములు

కడ్తాల్‌ గ్రామ పరిధిలోని సర్వే నం.894లో శ్రీశైలం హైవేకు ఇచ్చిన 36 గుంటల పట్టా భూమి కొంతమందికి అక్రమ రిజిస్ట్రేషన్లు కావడంపై కడ్తాల్‌‌కు చెందిన బి.రవి, కె.భాను కిరణ్‌ ప్రజావాణిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌కు ఇటీవల ఫిర్యాదు చేయడంతో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సర్వే నెం.894లో ఓ రైతుకు 16.07 ఎకరాలు ఉంది. ఇతనికి సంబంధించిన 0.36 గుంటల భూమి శ్రీశైలం హైవేలో పోయింది. హైవేలో పోయిన ఇతని భూమి ఇంకా రెవెన్యూ (సర్వే నెం.894/ఆ) రికార్డుల్లో కొనసాగడంతో 2006లో 36 గుంటల భూమిని వేరొకరికి విక్రయించాడు. ఇతని నుంచి భూమి మరో రైతుకు చేతులు మారింది. ప్రస్తుతం ఆ 36 గుంటల భూమి ముగ్గురు వ్యక్తుల చేతిలో బంధీ అయింది. వీరు తలా కొంత హైవేకు చెందిన రోడ్డును రిజిస్ట్రేషన్‌ సైతం చేసుకున్నారు. భూ భారతి వచ్చాక ప్రస్తుతం ఆన్‌‌లైన్‌‌లో వీరి పేరునే భూములు కన్పిస్తున్నాయి. ఈ ఒక్క సర్వే నంబరులోనే కాదు. రోడ్డులో పోయిన అన్ని సర్వే నంబర్లదీ ఇదే పరిస్థితి.

విచారిస్తే అక్రమాలు వెలుగులోకి..

శ్రీశైలం రహదారి రంగారెడ్డి జిల్లా పరిధిలో కడ్తాల్‌ మండలంతోపాటు, ఆమన్‌‌గల్‌ మండలం మీదుగానూ వెళ్తోంది. అధికారుల వద్ద 58 ఎకరాల లెక్క మాత్రమే ఉండగా.. ఈ రెండు మండలాల్లో 200లకు పైగా ఎకరాలు హైవేలో పోయాయి. ఆ భూములన్నీ ప్రస్తుతం ఇతర వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న దళారులు హైవేను ఆనుకుని ఉన్న మాక్స్​​‍ వర్త్ కంపెనీకి చెందిన భూముల్లో హద్దు రాళ్లు పాతి అమాయకులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాక్స్​​‍ వర్త్ కంపెనీలో భూములు కొనుగోలు చేసిన వారు చాలా వరకు హైద్రాబాద్‌, ఇతర దూర ప్రాంతాలకు చెందిన వారు కావడం.. వారి భూముల్లో పాగా వేసిన విషయం అసలైన యజమానులకు తెలియకపోవడం దళారులకు అడ్వాంటేజ్‌‌గా మారింది. ఇదే అదనుగా దళారులు హైవేలో పోయిన భూములతో రూ.కోట్లు ఆర్జించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

58 ఎకరాలు ఇంకా రైతుల పేరిటే..

దశాబ్దాల క్రితం నిర్మించిన హైదరాబాద్‌ - శ్రీశైలం ప్రధాన రహదారి కోసం ప్రభుత్వ భూములతో పాటు రైతుల నుంచి పట్టా భూములను సైతం సేకరించారు. ఇందులో భాగంగా కడ్తాల్‌ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 6(0.02ఎ), 7(0.13ఎ), 8(2.24ఎ), 11(0.37ఎ), 12(1.33ఎ), 16(1.17ఎ), 17(0.27ఎ), 18(0.25ఎ), 66(0.11ఎ), 67(0.24ఎ), 70(0.30ఎ), 71(1.00ఎ), 72(0.09ఎ), 361(0.12ఎ), 362(1.37ఎ), 366(1.31ఎ), 369(0.14ఎ), 370(0.26ఎ), 371(0.20ఎ), 376(0.39ఎ), 377(1.04ఎ), 378(1.38ఎ), 379(1.25ఎ), 380(1.28ఎ), 383(1.24ఎ), 385(1.20ఎ), 396(1.03ఎ), 397(0.09ఎ), 398(1.14ఎ), 632(0.13ఎ), 633(0.12ఎ), 658(1.29ఎ), 659(1.05ఎ), 666(1.34ఎ), 667(4.05ఎ), 893(1.17ఎ), 894(0.36ఎ), 895(1.02ఎ), 909(0.18ఎ), 912(0.25ఎ), 914(0.07ఎ), 922(0.06ఎ), 923(0.13ఎ), 925(1.02ఎ) కలిపి మొత్తం 44.20 ఎకరాలను, కర్కల్‌ పహాడ్‌ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 26(2.22ఎ), 27(0.20ఎ), 29(1.22ఎ), 38(2.29ఎ), 47(0.38ఎ), 120(0.33ఎ), 124(1.07ఎ), 129(1.00ఎ), 130(0.14ఎ) కలిపి మొత్తం 13.25 ఎకరాలను సేకరించారు. ఈ రెండు గ్రామాలలో మొత్తం 58.05 ఎకరాలను రహదారి కోసం రైతుల నుంచి భూమిని సేకరించారు. మొదట సింగిల్‌ లైన్‌‌గా ఉన్న శ్రీశైలం రోడ్డు మరింత విస్తరణకు నోచుకోగా.. ఈ రోడ్డు నేడు హైవే (నెం.765)గా రూపాంతరం చెందింది. భూ సేకరణ, పరిహారం చెల్లింపులు జరిగి ఏండ్లు అవుతున్నప్పటికీ నేటికీ ఈ భూములన్నీ రైతుల పేరు మీదుగానే రెవెన్యూ రికార్డుల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం..ఈ భూముల విలువ రూ.300 కోట్లకు పైనే! ఉంటుంది.

విచారణ జరుపుతాం

సర్వే నం.894లో శ్రీశైలం హైవే నిర్మాణం కోసం ఇచ్చిన 36 గుంటల భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరుగుతున్నట్లు మాకు ఫిర్యాదు వచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం.

- జయశ్రీ, తహశీల్దార్‌

Next Story