BJP: తెలంగాణలో జనసేనతో పొత్తు బీజేపీకి నష్టమేనా..?

by Malleboina Mahesh |

రాష్ట్రంలో జనసేనతో పొత్తు లాభం కంటే ఎక్కువ నష్టాన్నే కలిగిస్తుందని బీజేపీలోని మెజార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

BJP: తెలంగాణలో జనసేనతో పొత్తు బీజేపీకి నష్టమేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జనసేనతో పొత్తు లాభం కంటే ఎక్కువ నష్టాన్నే కలిగిస్తుందని బీజేపీలోని మెజార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలోని తెలంగాణవాదులు, స్వరాష్ట్ర ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినవారు, ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందేనని మొదటి నుంచి పట్టుబట్టిన నేతలందరూ పవన్ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఉత్తర తెలంగాణకు చెందిన నాయకులున్నారు. పవన్ పార్టీని ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా ఒప్పుకుంటామంటున్నారే తప్ప తెలంగాణలో మాత్రం పొత్తకు ససేమీరా అంటున్నారు.

ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించి వారం పాటు నిరాహార దీక్ష చేసినట్లుగా స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారని, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని కొద్దిరోజుల క్రితమే తెలంగాణ ప్రజలపై అక్కసును వెళ్లగక్కారని గుర్తు చేస్తున్నారు. జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆంధ్ర, కాపు సామాజిక ఓటర్లు అధికంగా ఉండే హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరగడంలేదని.. ఇలాంటి సందర్భంలో జనసేనతో పొత్తు వల్ల ఎలాంటి లాభం ఉండకపోగా నష్టమే జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.

పవన్ కల్యాణ్‌పై విమర్శల నేపథ్యంలో..

రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీలు అనేకమార్లు సమైఖ్యవాదిగా, తెలంగాణ వ్యతిరేకిగా పవన్ కల్యాణ్‌పై విరుచుకపడ్డాయి. కోనసీమకు తెలంగాణవాదుల దిష్ఠి అన్న సందర్భంలో మాజీ ఎమ్మెల్సీ కవిత పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాంటి పవన్‌తో పొత్తు ఏవిధంగా మేలు చేస్తుందో పార్టీ అగ్రనేతలకే తెలియాలంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

పార్టీ కేడర్, కింది స్థాయి నాయకుల అభిప్రాయాలు, ఆలోచనలతో సంబంధం లేకుండా పొత్తు పెట్టుకోవడంపై నిలదీస్తున్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో అంతో ఇంతో ప్రజల ఆదరణ ఉన్న బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. తాము ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ బలం తెలుస్తుందని, కానీ.. తమ నాయకుడు చెప్పినందునే పొత్తును ఒప్పుకుంటున్నామని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సైతం నిరాశ చెందుతున్నారు.

Next Story