' కామారెడ్డి ప్రయాణీకులపై ఆర్టీసీకి కనికరం లేదా '

by Batti.Sumithra |

కామారెడ్డి నుంచి వివిధ పనుల నిమిత్తం హైదరాబాదుకు వెళ్లిన ప్రయాణికులు పనులు ముగించుకొని జేబీఎస్ కు చేరుకోగానే సాయంత్రం ఐదు అయిందంటే ఒక్క బస్సు కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

 కామారెడ్డి ప్రయాణీకులపై ఆర్టీసీకి కనికరం లేదా
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి నుంచి వివిధ పనుల నిమిత్తం హైదరాబాదుకు వెళ్లిన ప్రయాణికులు పనులు ముగించుకొని జేబీఎస్ కు చేరుకోగానే సాయంత్రం ఐదు అయిందంటే ఒక్క బస్సు కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం ఐదు నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కామారెడ్డి వెళ్లే బస్సులు ఇక్కడి నుంచి లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అన్ని రూట్లలో బస్సులు నడుపుతున్న ఆర్టీసీ కామారెడ్డి రూట్ లోనే బస్సులు ఎందుకు నడపడం లేదని, ఇక్కడి ప్రయాణికులు అంటే ఆర్టీసీకి ఎందుకంత నిర్లక్ష్యమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కామారెడ్డి ఆర్టీసీ డిపో అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు.

కామారెడ్డి పైనే ఎందుకంత నిర్లక్ష్యం...!

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వివిధ పనుల నిమిత్తం వెళ్లిన ప్రయాణికులు సాయంత్రం పనులు ముగించుకొని కామారెడ్డికి బయలుదేరుదామంటే జూబ్లీ బస్టాండ్ నుండి కామారెడ్డికి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ నుండి అన్ని రోడ్లలో బస్సులు నడుపుతున్న ఆర్టీసీ కేవలం కామారెడ్డి రూట్ లోనే సాయంత్రం నుంచి తెల్లవారే వరకు బస్సులు నడపకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పైనే ఆర్టీసీ ఎందుకంత కక్ష కట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 100కు పైగా ప్రయాణికులు బస్టాండ్లో రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్నారు.

బస్సులు లేక బస ఎక్కడ..

కామారెడ్డి రూట్లో సాయంత్రం నుంచి తెల్లవారే వరకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు రాత్రిపూట ఎక్కడ బస చేయాలో తెలియక బస్సుల కోసం ఎదురుచూస్తూ బేజారవుతున్నారు. ఎక్కడ బస చేయాలో తెలియక బస్టాండ్ లోనే కొంతమంది నిరీక్షిస్తుండగా మరికొందరు మాత్రం ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారు.

ఇతర బస్సులే ఆధారం..

రాత్రి 8 తర్వాత ఒకటి నాందేడ్ బస్సు, మరొకటి బైంసా బస్సు తప్పితే అన్ని నాన్ స్టాప్ బస్సులే ఉండడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. మహిళా ప్రయాణికులు, చిన్న పిల్లలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు..

కామారెడ్డి రూట్లో సాయంత్రం అయిందంటే బస్సులు లేకపోవడంతో ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికులను తమ వాహనాల్లో తరలిస్తున్నారు. అది కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ తరలిస్తున్నప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు అడిగిన కాడికి ముట్ట చెబుతూ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు.

కామారెడ్డి డిపో వారు బస్సులు నడపరా...

కామారెడ్డి కి చెందిన ఆర్టీసీ డిపో వారు జూబ్లీ బస్టాండ్ కు సాయంత్రం అయిందంటే బస్సులు నడపకపోవడంతోనే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కామారెడ్డి ప్రయాణికులను ఏ డిపో వారు తమ గమ్యస్థానాలకు చేర్చుతారని ప్రయాణికులు కామారెడ్డి ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కామారెడ్డి ఆర్టీసీ డిపో అధికారులు స్పందించి సాయంత్రం నుండి రాత్రి వేళలో కూడా బస్సులు నడిపి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

Next Story