- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విచిత్ర విన్నపం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పథకాలు అమలుకావట్లేదని పదేపదే మాట్లాడుతున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన బహిరంగ విన్నపం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

దిశ, ఇబ్రహీంపట్నం ః రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పథకాలు అమలుకావట్లేదని పదేపదే మాట్లాడుతున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవాలను తెలుసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన బహిరంగ విన్నపం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. సబితా ఇంద్రారెడ్డిని వదినగా సంబోధిస్తూ..విడుదల చేసిన లేఖ ఆసక్తిగా ఉండడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విన్నపం సారాంశం ఇదీ:
గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక పథకాలు అమలుకావట్లేదని పదేపదే మాట్లాడుతున్న మా వదినమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి బహిరంగ విన్నపం ప్రభుత్వ పథకాలు అందడంలేదని ఇటీవల తరచుగా ఎక్కడికి వెళ్ళినా మీరు మాట్లాడుతున్నారు. అందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి, మీ తమ్మునికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఆడబిడ్డలందరికీ అన్నాతమ్ముడిగా రేవంత్ రెడ్డి గారు పంపే 'చీర సారె' మీకూ పంపిస్తారు. వారు పంపించిన "ఇందిరమ్మ చీర" ధరించి, ఇంటి నుంచి బయలుదేరండి. బయటికి వచ్చి బస్సెక్కి మీరు కావాల్సిన చోట దిగండి. "మహాలక్ష్మి పథకం" కింద ఆధార్ కార్డు చూపిస్తే, బస్సులో మిమ్మల్ని ఒక్క రూపాయి ఎవరూ అడగరు. ఒక వేళ రేషన్ కార్డు ఉంటే బస్సు దిగగానే రేషన్ దుకాణానికి వెళ్ళండి. అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించే "సన్నబియ్యం" కూడా తీసుకోండి.
అదే మార్గంలో మహిళా సంఘాలను కలవండి. అవసరమైతే అందులో చేరి, ఇందిరా మహిళా పథకం కింద ఒక్కో సంఘానికి వడ్డీ లేకుండా అందిస్తున్న "రూ. 10 లక్షల రుణ సదుపాయాన్ని" ఉపయోగించుకోవచ్చు. మీకు సంబంధించిన వారెవరైనా బిడ్డ పెళ్లి చేస్తే, "కళ్యాణలక్ష్మి" కింద అందిస్తున్న లక్ష 116 రూపాయల చెక్కు ఇప్పించండి. వారికి ఒక వేళ గృహవసతి లేని పక్షంలో ఇప్పటికే తొలివిడత పూర్తి అయినందున ఆ ఆడబిడ్డ పేరునే రానున్న రెండో విడత జాబితాలో "ఇందిరమ్మ ఇల్లు" ఇప్పించండి. సాయంత్రం ఇంటికి చేరాక "గృహజ్యోతి పథకం" కింద 200 యూనిట్ల వరకు అందుతున్న ఉచిత విద్యుత్ తో టీవీ, ఫ్యాన్ ఆన్ చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. తర్వాత వంటగదిలో 'మహాలక్ష్మి' పథకం కింద 500 రూపాయలకే వస్తున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై ఇష్టమైన వంటలు కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇలా పథకాల విషయంలో అవగాహన లేకున్నా, అనుమానం కలిగినా అక్కడికి వెళ్లి, స్వయంగా పరిశీలించి అర్హత కలిగి ఉంటే మీరూ లబ్ధిపొందండి. అప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయా లేదా అనే విషయంలో మీకు స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాను. ఇవే కాకుండా ప్రజలకు మంచే చేసే విషయంలో మీరు ఇంకా ఏవైనా సలహాలిచ్చినా, వాటిని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ధన్యవాదాలు వదినమ్మ.
ఇట్లు
మీ మల్ రెడ్డి రంగారెడ్డి






