- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీవీ చూస్తూ భోజనం, స్నాక్స్ తింటున్నారా? ఈ నష్టం తప్పదు!
టీవీ చూస్తున్నప్పుడు దృష్టి స్క్రీన్‌పైనే ఉండటం వల్ల కడుపు నిండిందనే సంకేతాలను మెదడు సరిగ్గా గ్రహించదు. ఫలితంగా సగటున 10-40% ఎక్కువ ఆహారం తినేస్తారు.

దిశ, ఫీచర్స్ : మీకు టీవీ చూస్తూ స్నాక్స్ తినడం లేదా భోజనం చేసే అలవాటు ఉందా? అయితే వెంటనే మానుకోవడం బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ అలవాటు క్రమంగా ఒబేసిటీని, ఆ తర్వాత మధుమేహం సహా ఇతర వ్యాధుల ప్రభావాన్ని పెంచుతుందని చెబుతున్నారు. గత పరిశోధనల ప్రకారం కూడా.. టీవీ లేదా స్క్రీన్ ముందు భోజనం చేసే వ్యక్తులు తాము ఉద్దేశించిన దానికంటే సగటున 40% ఎక్కువ ఆహారం తింటారు. అయినా దాని గురించి వారికి తెలియదు. ఇది ‘Distracted Eating’ అనే ఫినామెనానికి కారణం. అంటే.. తినడం, స్క్రీన్ చూడడం రెండూ ఏకకాలంలో జరగడం వల్ల మెదడు మనిషి ఎంత ఆహారం తీసుకున్నాడో సరిగా గుర్తించదు.
ఎందుకు ఇలా జరుగుతుంది?
స్క్రీన్ మీద దృష్టి పెట్టడం వల్ల కడుపు నుంచి వచ్చే ‘ఇక చాలు, కడుపు నిండింది’ అనే సిగ్నల్‌ను మెదడు నెమ్మదిగా, తక్కువ సమర్థవతంగా ప్రాసెస్ చేయడమే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ కారణంతోనే టీవీ చూస్తూ తినేవారు ఎక్కువసేపు, ఎక్కువల కేలరీలు తినేస్తుంటారు. అంతేకాకుండా టీవీ చూస్తున్నప్పుడు సామాజిక పర్యావరణ సంకేతాల(టేబుల్ ఖాళీ అవడం, సంభాషణ ముగియడం ఆగాలనే భావన)ను గుర్తించలేకపోవడంవల్ల తినడం ఆపకుండా కంటిన్యూ చేస్తుంటారు.
నష్టాలు
*టీవీ చూస్తున్నప్పుడు మన దృష్టి స్క్రీన్‌పై ఉండటం వల్ల కడుపు నిండిందనే సంకేతాలను మెదడు సరిగ్గా గ్రహించి ప్రాసెస్ చేయదు. ఫలితంగా సగటున 10-40% ఎక్కువ ఆహారం తినేస్తారు. ఇది తక్షణం కాకపోయినా, తర్వాత భోజనంలో కూడా ఎక్కువ తినే అవకాశం ఉంటుంది.
*ఎప్పుడో ఒకసారి కాకుండా నిరంతరం టీవీ చూస్తూ తినే అలవాటు వల్ల బరువు పెరగడం & ఊబకాయం (Weight Gain & Obesity) వంటి సమస్యలకు దారితీస్తుంది. దీంతో అనవసరపు కేలరీలు పేరుకుపోయి బరువు పెరుగుతుంది. పిల్లలు, యువకుల్లో ఈ అలవాటు ఊబకాయం ప్రమాదాన్ని బాగా పెంచుతుంది.
*స్క్రీన్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి, తిండిమీద శ్రద్ధ పెట్టరు. రుచిని ఆస్వాదించకుండా గబగబా తినేస్తుంటారు. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. బ్లోటింగ్, అజీర్ణం, అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. అలాగే టీవీ చూస్తూ చిప్స్, బిస్కెట్లు, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి జంక్ ఫుడ్ తినే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి ఈ అలవాటు పండ్లు, కూరగాయలు వంటివి తినడాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదంటే.. భోజన సమయంలో టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్ వంటివి చూడకూడదు. వాటిని పూర్తిగా ఆఫ్ చేయడం మంచిది. దీనివల్ల ఆహారం తిన్నప్పుడు వాటి రుచి, ఆస్వాదనను మెదడు, పోషకాలను శరీరం గ్రహిస్తుంది. అదనపు కేలరీలు తగ్గి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు దరిచేరవు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






