- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నేతలు బందిపోట్లు.. రైతుల ఉసురు తగలక మానదు!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ మంత్రుల తీరుపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, పెద్దపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ మంత్రుల తీరుపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ నేతలు బందిపోట్లుగా మారి సింగరేణి ప్రాంత వనరులను, ప్రజలను దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు. స్థానిక నాయకులు శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావులకు రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తోడయ్యారని మండిపడ్డారు. ఈ ముగ్గురూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అక్రమ సంపాదనపై పడ్డారని విమర్శించారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. ఆ నేతల కుటుంబ సభ్యులు ప్రజలను బోనస్‌గా పాలిస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఆయన తమ్ముడు శ్రీనుబాబు పెత్తనం చెలాయిస్తున్నారని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు ఏకంగా అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరించి లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక, మట్టి, బూడిద దందాలతో కోల్ బెల్ట్ ప్రాంతాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. అవినీతి తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఒక్క మంచి పని చేయడం లేదన్నారు.
రైతన్నల కన్నీటి గోస.. కల్లాల్లోనే ఆగుతున్న గుండెలు
కాంగ్రెస్ పాలనలో రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కొనే నాథుడు లేక రైతులు కల్లాల వద్దనే వరి కుప్పల మీద కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారని, మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్ అనే యువ రైతు తన వడ్లను సొంతంగా లారీలో తీసుకెళ్తే.. మిల్లర్లు కొనకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేయడం రాష్ట్రంలో రైతుల దయనీయ స్థితికి అద్దం పడుతోందన్నారు.
బాయిబాట.. సింగరేణి కార్మికుల సమస్యలు
గత నాలుగు రోజులుగా 'బాయిబాట' కార్యక్రమంలో భాగంగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, రామగుండం, మంథని ప్రాంతాల్లోని బొగ్గు గనులను సందర్శించి కార్మికుల సమస్యలు తెలుసుకున్నామన్నారు కవిత. సింగరేణిలో 2,000 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 500 ఇచ్చి పబ్లిక్ మీటింగ్‌ల కోసం వాటిని వాడుకుంటున్నారని మండిపడ్డారు. తాము బొగ్గు గనుల వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని, తమ మీటింగ్‌కు వస్తే కార్మికుల జీతాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తనను తాను హిట్లర్ అనుకుంటే, ఇక్కడి మంత్రి ఆయన కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
పెద్దపల్లిలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి ఇప్పటికీ పట్టించుకోవడం లేదని, స్థానిక ఎమ్మెల్యే ఇటుక బట్టీల వ్యాపారంలో బిజీగా ఉన్నారని, కనీసం సీఎంను అడిగే సాహసం చేయడం లేదని విమర్శించారు. ఓపెన్ కాస్ట్ కారణంగా పాడైన ఎస్సారెస్పీ కాలువను 30 నెలలైనా మంత్రి శ్రీధర్ బాబు పట్టించుకోలేదని, దాన్ని వెంటనే మరమ్మతు చేయించాలని డిమాండ్ చేశారు. ముక్తేశ్వరం నిర్మాణం, మంథని-ముత్తారం లింకేజీ పనులను వేగవంతం చేయాలన్నారు. భూపాలపల్లి వద్ద బ్యాక్ వాటర్‌తో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. రామగుండంలో కాలుష్యం ఢిల్లీ కంటే భయంకరంగా ఉందని, గోదావరి నీరు తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర సంస్థలున్న ఈ ప్రాంతంలో కార్మికుల ఈఎస్ఐ ఆస్పత్రి కోసం స్థానిక ఎంపీ కృషి చేయాలన్నారు.
ఉద్యోగాల పేరిట యువతకు మోసం..
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన కాంగ్రెస్, కేవలం 5 వేల కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చి చేతులు దులుపుకుందని కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో 15 లక్షల మంది యువత ప్రిపేర్ అవుతుంటే ఈ 5 వేల పోస్టులు ఏ మూలకు సరిపోతాయని, కనీసం 20 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ కూడా యువతను మోసం చేస్తోందన్నారు. ఇక తాము బాయిబాట పట్టగానే, బీజేపీ నేతలు కూడా అదే బాట పట్టారని, పనిచేయాల్సిన వారే ఆందోళనలు చేస్తే కార్మికులు గందరగోళానికి గురవుతారని చురకలంటించారు. ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారని, ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని కవిత అన్నారు.






