- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్‌ను కొడంగల్‌లో ఓడించి తీరుతాం: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొడంగల్ గడ్డపైనే ఎమ్మెల్యేగా ఓడించి తీరుతామని, రాష్ట్రంలో మొట్టమొదటి బిఆర్ఎస్ జెండా కొడంగల్‌లోనే ఎగురుతుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి సవాల్ విసిరారు.

దిశ,కొడంగల్: వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొడంగల్ గడ్డపైనే ఎమ్మెల్యేగా ఓడించి తీరుతామని, రాష్ట్రంలో మొట్టమొదటి బిఆర్ఎస్ జెండా కొడంగల్‌లోనే ఎగురుతుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జ్ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిలతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
లగచర్ల ఆడబిడ్డల ధైర్యం దేశానికే ఆదర్శం:
ముఖ్యమంత్రి నియోజకవర్గమని భయపడే ప్రసక్తే లేదని, ఇక్కడి ప్రజలు పాలకుల అణచివేతపై తిరగబడుతున్నారని ఆమె అన్నారు. భూసేకరణ పేరిట ప్రభుత్వం చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా లగచర్ల గ్రామ ఆడబిడ్డలు ఢిల్లీ దాకా వెళ్లి కొట్లాడి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రజల పక్షాన పోరాడినందుకే బిఆర్ఎస్ నాయకుడు నరేందర్ రెడ్డిని జైలుకు పంపించారని, జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయనలో ప్రజల కోసం పోరాడే కసి మరింత పెరిగిందని స్పష్టం చేశారు.
కేసీఆర్ హయాంలో స్కీమ్‌లు.. కాంగ్రెస్ హయాంలో స్కామ్‌లు:
గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రతి నెలా ఒక కొత్త సంక్షేమ పథకాన్ని (Scheme) చూశారని, కానీ ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం నెలకు ఒక కుంభకోణాన్ని (Scam) మాత్రమే చూస్తున్నామని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. స్థానిక సర్పంచులకు నిధులు ఇవ్వకుండా గ్రామీణ అభివృద్ధిని పూర్తిగా పడగెత్తించారని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు యాక్షన్ చేయడం తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరగడం లేదన్నారు.
పాత బిల్డింగ్‌లకు సున్నాలేసి కొత్త బోర్డులు:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని వదిలేసి 'ఫ్యూచర్ సిటీ' రియల్ ఎస్టేట్ వ్యాపారం చుట్టూ 30 సార్లు తిరిగారని ఎద్దేవా చేశారు. నిన్న ప్రారంభించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' కేసీఆర్ హయాంలో 'మన ఊరు - మన బడి' కింద డెవలప్ చేసిన 50 ఏళ్ల నాటి పాత బిల్డింగేనని, దానికి కేవలం సున్నాలు వేసి, గ్రౌండ్ సిద్ధం చేసి కొత్త బోర్డు తగిలించారని విమర్శించారు. అంతగా పేదలకు మేలు చేయాలనుకుంటే కొత్త నిధులతో పాఠశాలలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఉదయం 9 గంటలకే వనమహోత్సవం ప్రారంభిస్తారని, కానీ పాలనపై బాధ్యత లేని రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు మొక్కలు నాటుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'ఫిబ్రవరి 29' రైతుబంధు జోక్:
ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనకపోతే చూస్తూ ఊరుకోనని హెచ్చరించిన బీజేపీ నేత కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. రైతుబంధుపై గ్రామాల్లో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్తూ, "రేవంత్ రెడ్డి కచ్చితంగా రైతుబంధు ఇస్తాడు.. కానీ ప్రతి లీపు సంవత్సరంలో వచ్చే ఫిబ్రవరి 29వ తేదీన ఇస్తాడు" అని ఒక నిరక్షరాస్యుడైన సామాన్య రైతు తనతో అన్న మాటలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఉన్న అవగాహనను వివరించారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రతి గుండె కోరుకుంటోందని, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో రేవంత్ రెడ్డి కొడంగల్‌ను వదిలేసి మరెక్కడో పోటీ చేసుకునే పరిస్థితి వస్తుందని ఆమె జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.






