పాస్‌పోర్ట్ సేవలలో తెలంగాణ దేశానికే ఆదర్శం : డీజీపీ సీవీ ఆనంద్

by Naga Rani Yarlagadda |

పాస్‌పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియలో తెలంగాణ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

పాస్‌పోర్ట్ సేవలలో తెలంగాణ దేశానికే ఆదర్శం : డీజీపీ సీవీ ఆనంద్
X

దిశ,తెలంగాణ బ్యూరో: పాస్‌పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియలో తెలంగాణ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలిచింది. సాంకేతికతను ఒడిసిపట్టి, ప్రజలకు అత్యంత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తున్న రాష్ట్ర పోలీసులను కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి పురస్కారంతో సత్కరించింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏటా ప్రతిష్ఠాత్మకంగా అందించే ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్ పురస్కారాన్ని తెలంగాణ సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో జూన్ 17 నుంచి 19 వరకు జరిగిన పాస్‌పోర్ట్ సేవా దివస్ వేడుకల్లో.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం ఈ అవార్డును అందుకున్నారు.

పాస్‌పోర్ట్ వెరిఫికేషన్.. ఏడు రోజుల లోపే వెరిఫై..

గతంలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అంటే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, తెలంగాణ పోలీసులు ఆ ప్రక్రియను కేవలం 5 నుంచి 7 రోజులకు కుదించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 8,67,741 పాస్‌పోర్ట్ దరఖాస్తులు రాగా, అందులో 8,67,452 దరఖాస్తుల ధ్రువీకరణను పోలీసులు రికార్డు సమయంలో పూర్తి చేయడం గమనార్హం. అంతకుముందు 2024-25లోనూ వచ్చిన మొత్తం 8,06,684 దరఖాస్తులను సగటున ఏడు రోజుల లోపే వెరిఫై చేసి తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యుత్తమ పనితీరును కనబరిచారు. జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచారు.

తెలంగాణకు జాతీయ స్థాయి అవార్డులు రావడం ఇది ఏడోసారి

ఈ అద్భుతమైన వేగం వెనుక వెరిఫాస్ట్ సాఫ్ట్‌వేర్ కీలకంగా పనిచేస్తోంది. ప్రస్తుత డీజీపీ సీవీ ఆనంద్.. 2013-16 మధ్యకాలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నప్పుడు 2014లో ప్రత్యేకంగా ఈ యాప్‌ను రూపొందించారు. 2015లో దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారు. అప్పటి నుంచి ఈ సేవల్లో తెలంగాణకు జాతీయ స్థాయి అవార్డులు రావడం ఇది ఏడోసారి. ప్రస్తుతం ఈ వెరిఫాస్ట్ వ్యవస్థను మరింత ఆధునికీకరించి, కృత్రిమ మేధస్సు,డేటా మ్యాచింగ్ సాంకేతికతలను జోడించారు. ఈ సాంకేతికత ద్వారా దరఖాస్తుదారుల వివరాలను క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్,పాత పాస్‌పోర్ట్ రికార్డులు తదితర డేటాబేస్‌లతో క్షణాల్లో సరిపోల్చుతున్నారు. ఫలితంగా నకిలీ దరఖాస్తులు, నేర చరిత్ర ఉన్న వ్యక్తులను పోలీసులు వెంటనే పసిగట్టగలుగుతున్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగం.. సిబ్బంది సమన్వయం వల్లే ఈ ఘనత

అవార్డు స్వీకరించిన అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీస్ ధ్రువీకరణ అత్యంత కీలకమని, నాణ్యమైన సేవలు అందించడంలో తెలంగాణ పోలీసులు చూపుతున్న నిబద్ధతకు ఈ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం, క్షేత్రస్థాయిలో సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఇది తెలంగాణ పోలీసుల అంకితభావానికి, సేవా దృక్పథానికి ప్రతిబింబమని కొనియాడారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువయ్యేలా, పౌరులు తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుని పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అపాయింట్‌మెంట్‌ను స్వయంగా షెడ్యూల్ చేసుకునే నూతన సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు డీజీపీ ఈ సందర్భంగా వెల్లడించారు.

Next Story