- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జుక్కల్‌కు మరో కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.

దిశ, జుక్కల్ (నిజాంసాగర్): గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించే దిశగా మరో కీలక అడుగు పడింది. జుక్కల్ మండలంలోని సావర్‌గావ్ గ్రామంలో శుక్రవారం కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు. బాన్సువాడ డిపోకు చెందిన ఈ బస్సు కండెబలూర్, సావర్‌గావ్, విఠల్‌వాడి మీదుగా కంగ్టి వరకు ప్రయాణిస్తూ ప్రజలకు సేవలు అందించనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు ప్రతిరోజూ రాకపోకల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త బస్సు సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ సేవతో ప్రజలకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు వారి ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి అని అన్నారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల లక్షలాది మంది మహిళలు విద్య, ఉపాధి, వ్యాపారం, కుటుంబ అవసరాల కోసం ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రయాణించే అవకాశం పొందుతున్నారని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఈ పథకం ఎంతో దోహదపడుతోందని అన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా అనుసంధానం (కనెక్టివిటీ) కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చిరకాలంగా బస్సు సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న సావర్‌గావ్, కండెబలూర్, విఠల్‌వాడి గ్రామాల ప్రజలు కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం కావడం పై హర్షం వ్యక్తం చేశారు. తమ ఎన్నో ఏళ్ల కోరికను నెరవేర్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






