విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్న కారణం ఇదే.. : సీఎం రేవంత్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

తెలంగాణ.. భాషా ప్రయుక్త రాష్ట్రంగానో.. పాలన సౌలభ్యం కోసమో ఏర్పడిన రాష్ట్రం కాదని, 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకున్న కారణం ఇదే.. : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ.. భాషా ప్రయుక్త రాష్ట్రంగానో.. పాలన సౌలభ్యం కోసమో ఏర్పడిన రాష్ట్రం కాదని, 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. కానీ.. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తే.. కాంగ్రెస్ సర్కారు వచ్చాక విద్యను వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఎల్బీ స్టేడియంలో విద్యార్థులకు యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్లను గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి పంపిణీ చేశారు. అక్కడ వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థినీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర బడ్జెట్ లో 8.5 శాతం నిధులు అంటే.. రూ.26,600 కోట్లు విద్యాశాఖ కోసం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన పదేళ్ల పాలనలో వందేళ్ల నష్టం జరిగిందని విమర్శించారు. విద్యార్థులకు 10 ఏళ్లు డైట్ ఛార్జీలు, 16 ఏళ్లు కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వాటి ఛార్జీలను పెంచామన్నారు. విద్య ప్రక్షాళన చేసి.. ప్రతి పేదవాడి గుండెను తట్టాలనే విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్నానన్నారు.

తలరాతను మార్చేది తరగతి గదులే..

విద్యార్థుల తలరాతను మార్చేది తరగతి గదులేనని, రేపటి తెలంగాణ యువత దేశానికే ఆదర్శంగా నిలవాలంటే విద్యను ఇష్టపడి చదవాలని సూచించారు. ప్రభుత్వ విద్యే దేశానికి పునాది కావాలన్నారు. అందుకోసం ప్రభుత్వం ఏం కావాలన్నా అరేంజ్ చేస్తుందన్నారు. 140 కోట్లమంది ఉన్న దేశంలో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ రావడం లేదన్న సీఎం.. అది పాలకుల వైఫల్యంగా చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని, దీనిద్వారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. ఏఐతో వైట్ కాలర్ జాబ్స్ కు ఇబ్బంది ఏర్పడిందని, స్కిల్ ఉన్న బ్లూ కాలర్ జాబ్స్ కు ఏ ఇబ్బందీ లేదన్నారు. ఇందుకోసమే తెలంగాణలో ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా 119 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఆరుట్లలో నిర్మించి ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్లన్నీ ఫుల్లయ్యాయని గుర్తుచేశారు. ప్రభుత్వ స్కూళ్లలో నో పర్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో చదివినవారు ఐఏఎస్ లు, ఐపీఎస్ లుగా ఎదగాలని, తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులకు ఏం కావాలన్నా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.

Next Story