- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా కావాలంటే నానో డీఏపీ తప్పనిసరా..?
వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సిన బాధ్యత ఉన్న ఎరువుల వ్యాపారులు కొందరు అక్రమ వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, మర్రిగూడ : వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సిన బాధ్యత ఉన్న ఎరువుల వ్యాపారులు కొందరు అక్రమ వ్యాపార పద్ధతులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకపల్లి గ్రామంలోని ధనలక్ష్మి ట్రేడర్స్ యూరియా కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా నానో డీఏపీ కూడా కొనాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
రైతుల కథనం ప్రకారం, యూరియా కోసం ముందస్తుగా బుకింగ్ చేసుకున్నప్పటికీ ఎరువులు తీసుకునే సమయంలో అవసరం లేని నానో డీఏపీని బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా అదనపు డబ్బు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ప్రశ్నించిన వారికి యూరియా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు లపంగి శ్రీను మాట్లాడుతూ.. మూడు యూరియా బస్తాలు తీసుకునే సమయంలో అవసరం లేదని చెప్పినా నానో డీఏపీ బాటిల్ కూడా కొనుగోలు చేయాలని ట్రేడర్స్ నిర్వాహకులు స్పష్టం చేశారని తెలిపారు. "నానో డీఏపీ తీసుకుంటేనే యూరియా ఇస్తాం" అని చెప్పడంతో చేసేదేమీ లేక అదనపు డబ్బు చెల్లించి ఎరువులు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే లెంకపల్లి గ్రామానికి చెందిన మరికొందరు రైతులు, యూరియా కోసం ముందస్తుగా బుకింగ్ చేసినప్పటికీ అదనపు డబ్బు చెల్లించేందుకు నిరాకరించడంతో తమ బుకింగ్‌ను రద్దు చేశారని ఆరోపిస్తున్నారు. అనంతరం మళ్లీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో తమకు కేటాయించిన యూరియాను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణపై కూడా రైతులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గతంలో కూడా అధిక ధరలకు ఎరువుల విక్రయాలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే కొందరు ట్రేడర్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శిస్తున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులకు అవసరం లేని ఉత్పత్తులను బలవంతంగా విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. యూరియా సరఫరాను ఇతర ఉత్పత్తుల కొనుగోలుతో ముడిపెట్టడం, అధిక ధరలు వసూలు చేయడం వంటి ఆరోపణలపై వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమైతే సంబంధిత ట్రేడర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ సీజన్‌లో రైతులు ఇబ్బందులు పడకుండా జిల్లా ఉన్నతాధికారులు మండలవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఎరువుల విక్రయాల్లో పారదర్శకత తీసుకురావాలని, అక్రమాలకు పాల్పడిన డీలర్ల లైసెన్సులను రద్దు చేయాలని కోరుతున్నారు. అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.






