అభివృద్ధి పనుల కోసం ప్రశ్నించడానికి స్థాయి అవసరమా ?

by Batti.Sumithra |

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఎన్నికల సమయంలో ఓట్లు వేసి గెలిపించేటప్పుడు లేని స్థాయి సమస్యల పై ప్రశ్నించేటప్పుడు ఎందుకు వస్తుందని కాంగ్రెస్ నాయకులపై శంకర్‌పల్లి మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు.

అభివృద్ధి పనుల కోసం ప్రశ్నించడానికి స్థాయి అవసరమా ?
X

దిశ, శంకర్‌పల్లి : ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఎన్నికల సమయంలో ఓట్లు వేసి గెలిపించేటప్పుడు లేని స్థాయి సమస్యల పై ప్రశ్నించేటప్పుడు ఎందుకు వస్తుందని కాంగ్రెస్ నాయకులపై శంకర్‌పల్లి మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. శంకర్‌పల్లి మండలం చందిప్ప గ్రామంలోని మన ఊరు కన్వెన్షన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాల చిన్న నరసింహులు తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ, మండల పరిధిలోని గ్రామాల రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, రోడ్ల సమస్యల గురించి ప్రశ్నిస్తే స్థాయి లేదు అని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ప్రజా సమస్యల గురించి మాత్రమే ఎమ్మెల్యేను ప్రశ్నించామని, ఆయన వ్యక్తిగత విషయాలను తాము ఎప్పుడూ ప్రస్తావించలేదని పేర్కొన్నారు. పరివేద, సంకేపల్లి, అంతప్పగూడ, గాజులగూడ, చందిప్ప గ్రామాల రోడ్లు అధ్వానంగా తయారై ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని మాత్రమే తాము ప్రస్తావించామని, వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని తెలిపారు. ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు ఓటు వేసి గెలిపించామని, గెలిపించిన ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెనుక ఉన్న కొంతమంది కోటరీ నాయకులు ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి అభివృద్ధి కోసమే మారానని చెబుతున్న ఎమ్మెల్యేకు ప్రజా సమస్యలు చెప్పడం తప్పా అని ప్రశ్నించారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మండల అభివృద్ధి కోసమే తాము సమస్యలను ప్రస్తావిస్తున్నామని, ఎవరిపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అనుచరులే ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని నిరుపేదలకు కేటాయింపులు చేపట్టకుండా, 13, 14 బ్లాకుల్లోని 151 ఇళ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అనుచరులకు, భూములు, ఇళ్లు, కార్లు ఉన్నవారికి, తమ వద్ద పనిచేసే డ్రైవర్లకు, ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు.

ప్రభుత్వ భూములు, బఫర్ జోన్ భూములను కూడా కబ్జా చేస్తూ నీతులు వల్లించడం సిగ్గుచేటని విమర్శించారు. కొంతమంది నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవని వారు పార్టీలు మారి పదవులు అనుభవిస్తూ, ఆపై తమను విమర్శించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాణిక్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ బి. శ్రీధర్, చందిప్ప సర్పంచ్ మల్లికార్జున్, మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీకాంత్, మాణిక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ యాదగిరి, నాయకులు విజయ్ కుమార్, వాసుదేవ్, కన్నా వేణుగోపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story