జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా స్ఫూర్తి స్థల్ వద్ద ఘన నివాళులు..

by Taduka Kalyani |

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్ద ఉన్న ఆయన స్మారక స్థలం "స్ఫూర్తి స్థల్" వద్ద రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.

జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా స్ఫూర్తి స్థల్ వద్ద ఘన నివాళులు..
X

దిశ ఖైరతాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్ద ఉన్న ఆయన స్మారక స్థలం "స్ఫూర్తి స్థల్" వద్ద రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు కే. కేశవరావు, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి దేశ రాజకీయాల్లో విలువలకు, ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహా నేత అని కొనియాడారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ, తన వాదనలతో పార్లమెంట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన గొప్ప వక్తగా ఆయనను గుర్తు చేసుకున్నారు..ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, నిజాయితీ, రాజకీయాల్లో విలువలను కాపాడిన తీరు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా జైపాల్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. అనంతరం ఆయన స్మారక స్థలం వద్ద రెండు నిమిషాల మౌనం పాటించి, జైపాల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.

Next Story